అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలె : మంత్రి తలసాని

అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలె : మంత్రి తలసాని

యాదవుల ఆరాధ్య దైవం కొమురవెళ్లి మల్లన్న స్వరూపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రజ్ఞాపూర్ లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి తలసాని... యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడా లేని విధంగా రూ.11 వేల కోట్ల వ్యయంతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, షీప్ ఫెడరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురవెళ్లి మల్లన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి తలసాని అన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే, మన అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. మాయ మాటలు చెప్పే వారిని కాకుండా చేతల ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పారు. హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్ ను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని తలసాని తెలిపారు. నీతి, నిజాయితీలకు మారు పేరు యాదవులన్న ఆయన...  గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని స్పష్టం చేశారు.