
Credit Score: ఈరోజుల్లో ప్రజలు తమ అవసరాల కోసం పర్సనల్ లోన్స్ లేదా హోమ్ లోన్, వెహికల్ లోన్స్ కోసం వెళుతున్న సంగతి తెలిసిందే. సహజంగా రుణం కోసం వెళ్లినప్పుడు బ్యాంకులు గ్రహీతకు సంబంధించిన అనేక ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటుంటాయి. వీటిలో ఏది తక్కువైనా నేరుగా లోన్ రిజెక్ట్ చేయకుండా ప్రత్యామ్నాయంగా కో-అప్లికెంట్ ద్వారా రుణాన్ని అందించటానికి ముందుకు వస్తుంటాయి. అలాంటి సమయంలో జాయింట్ లోన్స్ అందిస్తుంటాయి.
సహజంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తక్కువ సిబిల్ స్కోర్, అధిక డెట్ టూ ఇన్కమ్ రేషియో కలిగిన లేదా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల విషయంలో కో-అప్లికెంట్ తప్పనిసరి చేస్తుంటాయి. ఒకవేళ అనుకోని సందర్భాల్లో రుణ పొందిన వ్యక్తులు దానిని సకాలంలో తిరిగి చెల్లింపులు చేయలేకపోతే కోఅప్లికెంట్ నుంచి వసూలు చేస్తుంటాయి. సహజంగా రుణగ్రహీత పిల్లలు, భార్య లేదా తల్లిదండ్రుల జాయింట్ రుణాల్లో కో-అప్లికెంట్ గా ఉంటుంటారు.
ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి దాని చెల్లింపులను క్రమం తప్పకుండా సకాలంలో చేస్తున్నట్లయితే.. కో-అప్లికెంట్ సిబిల్ స్కోర్ కూడా మెరుగుపడుతుంటుంది. ఇది పరోక్షంగా ఇద్దరికీ మేలు చేస్తుంటుంది. అయితే ఒకవేళ సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేయటం మిస్ అయితే ఇద్దరి సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. బ్యాంకులు చట్టప్రకారం ఇద్దరిపై లోన్ రికవరీ కోసం చర్యలు చేపడతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిది.
►ALSO READ | IPO News: ఇన్వెస్టర్లను నిరాశపరిచిన ఏథర్ ఐపీవో.. తొలిరోజే మ్యూటెడ్ లిస్టింగ్..
అందువల్ల రుణాల విషయంలో కో-అప్లికెంటుగా ఉండాలని నిర్ణయం తీసుకునే ముందే దాని పర్యవసానాల గురించి కూడా తెలుసుకోవటం మంచిది. ఇంట్లోని వారి కోసం కాకుండా తెలిసిన వ్యక్తులు, స్నేహితుల కోసం జాయింట్ రుణాలకు షూరిటీదారుగా ఉండటం అనేక చిక్కులను తెచ్చిపెడుతుందని గమనించాలి. బ్యాంకులు 90 రోజుల పాటు చెల్లింపులు చేయని రుణాలను నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తుంటాయి. దీనివల్ల తర్వాత కో-అప్లికెంట్ కూడా వేరే చోట్ల రుణాలను పొందటం చాలా కష్టతరంగా మారుతుంది.