ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్​లో చోటు

ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్​లో చోటు

ఎన్టీఆర్ ఐదో కుమారుడైన మోహన కృష్ణ పెద్దకొడుకు తారకరత్న. 1983 ఫిబ్రవరి 23న జన్మించారు. తాత, బాబాయి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, హీరోగా రాణించాలనే కలతో సినిమాల్లోకి వచ్చారు. ఇరవై ఏళ్ల వయస్సులో హీరోగా కెరీర్ ప్రారంభించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాలు, ఒక వెబ్ సిరీస్ లో నటించారు. 2001లో తన తెరంగేట్రం ఓ సంచలనమైంది. ఒకే రోజు ఆయన హీరోగా 9 సినిమాలకు ఓపెనింగ్ జరిగింది. ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. విడుదలైన మొదటి చిత్రం ‘ఒకటో నంబర్ కుర్రాడు’. కె.రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే అం దిస్తూ అశ్వనీదత్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఫస్ట్ మూవీతోనే హీరోగా మెప్పించడంతో పాటు మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నారు తారకరత్న. అయితే తర్వాత వచ్చిన యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో మొదలుపెట్టిన 9చిత్రాల్లో ఐదు మాత్రమే విడుదల అయ్యాయి. మిగతా చిత్రాలు షూటింగ్ కూడా మొదలవకుండానే ఆగిపోయాయి.

రాజకీయాలపై దృష్టి..

నటుడిగా తిరిగి బిజీ అవుతున్న సమయంలో అనూహ్యంగా రాజకీయాలపై తారకరత్న దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి తనవంతు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు. నారా లోకేశ్ ఇటీవల ప్రారంభించిన పాదయాత్రలో టీడీపీ శ్రేణులతో కలిసి నటిసేందుకు ముందడుగు వేశారు. కానీ ఇంతలోనే మరణించారు.

విలన్‌గా రీ ఎంట్రీ

కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని 2009లో దర్శకుడు రవి బాబు పిలుపుతో ‘అమరావతి’లో తారకరత్న నటిం చారు. ఇందులో విలన్ గా తన నటనకు ప్రశంసలు రావడంతో పాటు బెస్ట్ విలన్ గా నంది పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత హీరోగా వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా చిత్రాల్లో నటించారు. 2016లో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రంలో మళ్లీ విలన్‌గా తారకరత్న నటించారు. తర్వాత ఖయ్యూంబాయ్, దేవినేని, సారథి చిత్రాలతో పాటు ‘9 హవర్స్’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. గత ఏడాది డిసెంబర్ 31న విడుదలైంది. ‘మిస్టర్ తారక్’ అనే చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.