
నితేశ్ ఒకసారి ఏదో పని మీద ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ సాంబార్ వడ తిన్నాడు. అది అతనికి చాలా నచ్చింది. దాంతో ఢిల్లీకి వెళ్లాక కూడా అచ్చం అలాంటి టేస్టీ సాంబార్ వడనే తినాలి అనుకున్నాడు. కానీ.. దొరకలేదు. నితేశ్‌లాగే ఎంతోమంది ఉద్యోగం, బిజినెస్.. ఇలా ఏదో ఒక కారణంతో రాష్ట్రాలు దాటి పోతుంటారు. వాళ్లకు వాళ్ల సొంత రాష్ట్రాల్లోని స్ట్రీట్ ఫుడ్ అక్కడ దొరకదు. ఈ వెలితిని భర్తీ చేసేందుకే సౌరభ్ ‘దహిబారా ఎక్స్‌ప్రెస్’ పెట్టాడు. ఇందులో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దొరికే కొన్ని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ఏ రాష్ట్రం వాళ్లు దహిబారాకు వెళ్లినా తమకు నచ్చే స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుందన్నమాట!
సౌరభ్ ఖండేల్వాల్ ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదు. కానీ.. అతనికి ఎదురైన కొన్ని పరిస్థితులు అటువైపు నడిపించాయి. ఒడిశాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి, పెరిగిన సౌరభ్ 18 ఏండ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. దాంతో తనను తాను పోషించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చదువుకుంటూనే డబ్బు సంపాదించుకోగలిగే కోర్సులో చేరాలనే ఆలోచనతో హోటల్ మేనేజ్‌మెంట్‌ను ఎంచుకున్నాడు. కాలేజీలో చేరగానే భువనేశ్వర్‌లోని ఒక హోటల్‌లో వెయిటర్ ఉద్యోగం చూసుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్‌లు వినేవాడు. ఆ తర్వాత పనికి వెళ్లేవాడు. కానీ.. ఒక వెయిటర్‌కు ఎంత నాలెడ్జ్, స్కిల్స్ ఉన్నా బాగా సంపాదించలేడని అతనికి అర్థమైంది. ఒక మనిషికి పనిచేయడం మొదలుపెట్టిన మొదటి 20 ఏండ్లు మాత్రమే గోల్డెన్ పీరియెడ్. కాబట్టి ఆ టైంలోనే ఎదగాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచన అతనిలో బలంగా నాటుకుపోయింది. అలాంటి నిజమైన గ్రోత్ స్వంతంగా బిజినెస్ చేస్తేనే వస్తుందని నమ్మాడు సౌరభ్. ‘‘నాకంటూ ఒక సొంత బ్రాండ్ ఉంటే మొదట్లో నష్టాలు వచ్చినా.. ఏనాటికైనా సక్సెస్ అవుతానని అనిపించింది. అందుకే నా ఆలోచనలని బిజినెస్ వైపు మళ్లించా” అంటూ చెప్పుకొచ్చాడు.
రియల్ ఎస్టేట్
కాలేజీలో చదువుతున్నప్పుడే సౌరభ్ ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ ప్రారంభించాడు. కొన్ని నెలల్లోనే బిజినెస్ బాగా పెరిగింది. కంపెనీలో దాదాపు 70మంది ఉద్యోగులు పనిచేసేవాళ్లు. చాలా రకాల రియల్ ఎస్టేట్ సర్వీసులు అందించేవాడు. ‘అంతా బాగుంది’ అనుకున్నప్పుడే దేశమంతా కరోనా, ఒడిశాలో ఒక పెద్ద సైక్లోన్ వెంటవెంటనే వచ్చాయి. ఈ రెండూ అతని వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దాంతో బిజినెస్ మూసివేయవలసి వచ్చింది. ఎంప్లాయిస్‌కి జీతాలు ఇచ్చేందుకు చివరకు ఆఫీస్‌లోని ఫర్నిచర్ కూడా అమ్మేశాడు. ‘‘బిజినెస్ చేయడమంటే మామూలు విషయం కాదని అర్థమైంది. అందుకే నా ఆలోచనలు మార్చుకుని డిఫెన్స్ ఇంక్యుబేషన్‌లో మేనేజర్‌గా చేరా. ప్రాజెక్టులను మేనేజ్ చేయడం, అవి డెవలప్ అవుతాయా? లేదా? అని గుర్తించడమే అక్కడ నేను చేసిన పని” అంటూ తన ఎక్స్‌పీరియెన్స్‌ని చెప్పుకొచ్చాడు సౌరభ్. అక్కడ కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాణించాడు. ఉద్యోగం చేస్తున్నా బిజినెస్ పెట్టాలనే ఆలోచన మాత్రం అతని మదిలో మెదులుతూనే ఉంది.
ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్
ఒడిశాలో దహిబారా అనే స్ట్రీట్‌ఫుడ్ చాలా ఫేమస్. దీన్ని దేశమంతా పరిచయం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు సౌరభ్. అందుకే దహిబారా మీద రీసెర్చ్ మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి వివిధ ప్రాంతాల్లో మొత్తంగా 63 రకాల దహిబారాలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నాడు. ఒడిశా వాళ్లకు వాటి గురించి బాగా తెలుసు. కానీ.. ఇతర రాష్ట్రాల ప్రజలకు పెద్దగా తెలియదు. కాబట్టి దేశవ్యాప్తంగా బిజినెస్ విస్తరించాలంటే దహిబారాతో పాటు ప్రతి ఇండియన్ స్టేట్‌లో ఉండే ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్స్ చైన్‌ని నిర్మించాలి అనుకున్నాడు సౌరభ్. ఒక దుబాయ్ ఇన్వెస్టర్‌కు ఈ ఆలోచన నచ్చి రూ. 6 కోట్ల ఫండింగ్ చేశాడు. దాంతో 2023లో ‘దహిబారా ఎక్స్‌ప్రెస్’కు పునాదులు వేశాడు.
ఒక కేఫ్‌లా..
దహిబారా ఎక్స్‌ప్రెస్‌ని ఒక కేఫ్‌లా డిజైన్ చేయించాడు. అంతకుముందే సౌరభ్ దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ గురించి తెలుసుకున్నాడు. వెళ్లిన ప్రతిచోట ఒక ఎక్స్‌పర్ట్‌ని కలిసి రెసిపీలు చేయడం నేర్చుకున్నాడు. ఇలా మొత్తం రీసెర్చ్ పూర్తి చేసేందుకు అతనికి దాదాపు 8 నెలలు పట్టింది. ‘‘కొందరు తమ రెసిపీని అందరితో పంచుకోరు. ఒకసారి నేను దహిబారా తయారీలో పేరుగాంచిన ఒక వ్యక్తి ఇంట్లో రెండు రోజులు ఉండి, పరిశీలించి రెసిపీని నేర్చుకోవలసి వచ్చింది. కొంతమందికి డబ్బు ఇచ్చి నేర్చుకున్నా. అలా దహిబారా ఎక్స్‌ప్రెస్‌లోకి దహిబారా, కోజు కట్టై, కంజి వడ, సాంబార్ వడ, దాల్ పక్వాన్ లాంటి 35 సంప్రదాయ స్ట్రీట్‌ఫుడ్స్‌తోపాటు ఫిల్టర్ కాఫీ, ఖావా టీ, కచ్చా ఆంపానీ లాంటి పానీయాలను చేర్చా. దక్షిణాది నుంచి వచ్చి నార్త్‌లో ఉంటున్నవాళ్లు ఎవరైనా మా అవుట్‌లెట్‌కు వస్తే వాళ్ల కోసం మా దగ్గర సాంబార్ వడ దొరుకుతుంది. అది అచ్చం సౌత్‌లో తిన్నట్టే ఉంటుంది. అలా దేశంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చినవాళ్లకైనా మా ‘దహిబారా ఎక్స్‌ప్రెస్’ వెల్కమ్ చెప్తుంది”అంటున్నాడు సౌరభ్.
తక్కువ పెట్టుబడి
దహిబారా ఎక్స్‌ప్రెస్‌ను తక్కువటైంలో డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఫ్రాంచైజీ ఎక్స్‌పాన్షన్ మోడల్‌ని రూపొందించాడు సౌరభ్. ఫ్రాంచైజీ పెట్టాలి అనుకునేవాళ్లు ముందుగా రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ప్రతి అవుట్‌లెట్‌లో అనుభవజ్ఞుడైన చెఫ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. స్ట్రీట్స్ ఫుడ్స్ చేయడంలో వాళ్లే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఒడిశాతోపాటు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మొత్తంగా 40 దహిబారా ఎక్స్‌ప్రెస్ అవుట్‌లెట్లు ఉన్నాయి. నేపాల్‌లో అవుట్‌లెట్ పెట్టి విదేశాల్లో తొలి అడుగు వేశారు. ఇప్పుడు దుబాయ్‌లో కూడా అవుట్‌లెట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నెలకు రూ. 1.8 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే.. మార్చి 2026 చివరి నాటికి 100 అవుట్‌లెట్లకు విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు సౌరభ్.