- పీకల్లోతు అప్పులు
- భారీగా ఉద్యోగుల రాజీనామాలు
- రవీంద్రన్‌పై మండిపడుతున్న ఇన్వెస్టర్లు
వెలుగు బిజినెస్ డెస్క్: ఒకప్పుడు భారతదేశ ఎడ్‌టెక్ పరిశ్రమలో స్టార్‌గా మెరిసిన స్టార్టప్ బైజూస్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. కంపెనీ పాపులారిటీ, వాల్యుయేషన్ విపరీతంగా తగ్గుతున్నాయి. అందుకే సీఈఓ రవీంద్రన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పదవుల నుంచి తొలగించాలంటూ మిగతా ఇన్వెస్టర్లు ఈజీఎంలో ఓటు వేశారు.
సంస్థను ప్రారంభించినప్పుడు లక్షలాది స్టూడెంట్లలో కలకలాడిన సంస్థ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే... క్లాసుల్లోని కుర్చీలను, ఇతర సామాన్లను ఎత్తుకుపోయే వరకు దిగజారింది. తగిన మార్కెటింగ్ వ్యూహాలు లేకపోవడం, ఫైనాన్షియల్మిస్మేనేజ్మెంట్ ప్రస్తుత పరిస్థితికి కారణమని ఎక్స్పర్టులు అంటున్నారు.
పెరుగుతూనే ఉన్న నష్టాలు
తాజా ఆర్థిక సంవత్సరంలో రూ.5,603 కోట్ల (710 మిలియన్ డాలర్ల) లోటును ఇది ప్రకటించింది. కంపెనీ భారీ అప్పుల భారంతో ఇబ్బంది పడుతోంది. దీని విలువ బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. అందుకే సంస్థ ముందుకు సాగడం లేదు. కొత్తగా నిధులను పొందడం కష్టంగా మారింది. బైజూస్ విలువ 2022లో 22 బిలియన్ల డాలర్ల నుంచి ప్రస్తుతం మూడు బిలియన్ డాలర్లకు పడిపోయింది. కరోనా కాలంలో అద్భుతంగా నడిచిన ఆన్లైన్ టీచింగ్ వ్యాపారం క్రమంగా నష్టాల పాలయింది. క్యాష్‌ఫ్లోలు పడిపోవడంతో అప్పులు పెరిగాయి.
వెళ్లిపోతున్న ఉద్యోగులు
ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బైజూస్ 2022, 2023లో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. వీరిని విపరీతంగా వేధించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో కంపెనీలో అనిశ్చితి, గందరగోళం ఏర్పడింది. సంస్థ వ్యాపార పద్ధతులు, ప్రొడక్టులకు సంబంధించిన చట్టపరమైన సవాళ్లతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. బైజూస్ స్క్రూటినీ లిటిగేషన్‌ను కూడా ఎదుర్కొంటోంది. బైజూస్ ఆడిటర్ డెలాయిట్ ఆర్థిక పారదర్శకత గురించి ప్రశ్నలను లేవనెత్తుతూ 2023లో రాజీనామా చేసింది.
అనేక మంది బోర్డు సభ్యులు కూడా వెళ్లిపోయారు. ఫలితంగా బైజూస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యాపారాన్ని పునర్నిర్మించడానికి, అదనపు నిధులను పొందేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. పరిశ్రమ పరిశీలకులు వారి ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తుండటంతో భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, బైజుస్‌కు ఇప్పటికీ పెద్ద యూజర్ బేస్, బ్రాండ్ గుర్తింపు ఉంది. సంస్థ ఈ అల్లకల్లోలాన్ని తట్టుకోగలదా లేదా ? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
