
హైదరాబాద్: రైతుల మేలు కోసమే సీఎం కేసీఆర్ ధర్నా చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకే ఈ ధర్నా చేస్తున్నామని చెప్పారు. యాసంగి పంట వడ్లను కేంద్రంమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు దిగింది. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక సీఎం ధర్నాకు పూనుకోవడం విచారకరమన్నారు. కానీ కేంద్రానికి రాష్ట్ర రైతుల గోడు తెలియజేసేందుకు, వారి విద్యుక్త ధర్మాన్ని తెలియజెప్పేందుకు ఇలా చేయక తప్పడం లేదన్నారు.
‘ఏడేళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో అద్భుతాలు సృష్టించాం. రాష్ట్రం సుభిక్షంగా ఉంది. పల్లెలన్నీ పచ్చబడ్డాయి. ఏ రైతు మొహంలో చూసినా సంతోషం వెల్లివిరుస్తోంది. మా బతుకులకు ఢోకా లేదనే వాళ్లలో నమ్మకాన్ని కలిగించాం. కానీ కేంద్రం పాటిస్తున్న అస్పష్టమైన విధానాల వల్ల రైతాంగంలో భయాలు నెలకొన్నాయి. కేంద్రంతోపాటు ఈ రాష్ట్ర బీజేపీ నేతల వైఖరి వల్ల వరి కొనుగోళ్ల విషయంలో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. పంట కొనుగోలు బాధ్యత కేంద్రానిదే. ఇది మేం చెప్పింది కాదు. రాజ్యాంగపరమైన విధిని నిర్వర్తించమని చెబుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై నెపాన్ని నెడుతూ, అనుమానాలు వచ్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలు, పంపిణీ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అన్ని వ్యవస్థలు వారి చేతుల్లోనే ఉన్నాయి. కొనుగోళ్లు చేయమంటే గందరగోళం సృష్టిస్తున్నారు. కేంద్రం తన నిర్ణయాలను పున: సమీక్షించుకోవాలి. తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలవాలి. దేశం కోసం, ధర్మం కోసం అని నినాదాలు ఇచ్చే బీజేపీ సర్కార్.. ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కొంటామని లిఖితపూర్వకంగా రాసివ్వాలి’ అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.