
- మార్చి క్వార్టర్‌లో రూ. 16,695 కోట్ల నికర లాభం
- షేరుకి రూ. 11.30 డివిడెండ్..వచ్చే నెల 14 రికార్డ్ డేట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ అదరగొట్టింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రికార్డ్ లెవెల్లో రూ.16,695 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్ ఎలోన్) సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో సాధించిన రూ.9,113 కోట్లతో పోలిస్తే ఇది 83 శాతం ఎక్కువ. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ.11.30 డివిడెండ్‌గా ఇచ్చేందుకు బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ కోసం వచ్చే నెల 14 ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఎస్‌బీఐకి ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.40,393 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. ఇది ఏడాది ప్రాతిపదికన రూ.31,198 కోట్ల నుంచి 29 శాతం గ్రోత్‌కు సమానం. ఎస్‌బీఐ ప్రాఫిట్, ఆదాయం రెండూ కూడా ఎనలిస్టుల అంచనాలను అధిగమించాయి. బ్యాంక్‌కు క్యూ4 లో రూ.15,000 కోట్ల నికర లాభం, రూ.40 వేల కోట్ల నికర వడ్డీ ఆదాయం వస్తుందని ఎకనామిక్ టైమ్స్ పోల్ అంచనావేసింది.
2022–23 లో రూ.50 వేల కోట్ల ప్రాఫిట్..
ఎస్‌బీఐకి 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.50,232 కోట్ల నికర లాభం (స్టాండ్ ఎలోన్) వచ్చింది. ఇది ఏడాది ప్రాతిపదికన 58 శాతం గ్రోత్‌కు సమానం. బ్యాంక్ అప్పులివ్వడం పెరిగింది. రిటైల్ సెగ్మెంట్‌లో ఇచ్చిన లోన్లు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 17.64 శాతం, ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో ఇచ్చిన లోన్లు 17.59 శాతం పెరిగాయి. అగ్రి, కార్పొరేట్ లోన్లు కూడా సుమారు 13 % చొప్పున వృద్ధి సాధించాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 9.9 % పెరిగాయి.
షేరు ఢమాల్..
రిజల్ట్స్ వెలువడిన తర్వాత ఎస్‌బీఐ షేర్లు పడ్డాయి. బ్యాంక్ గురువారం మధ్యాహ్నం రిజల్ట్స్ ప్రకటించింది. మార్నింగ్ సెషన్‌లో ప్రాఫిట్‌లో కదిలిన బ్యాంక్ షేర్లు, మధ్యాహ్నం సెషన్‌లో రెండున్నర శాతం వరకు పడ్డాయి. చివర్లో కొంత లాభపడి 1.70 శాతం నష్టంతో రూ.576 వద్ద ముగిశాయి.
తగ్గిన మొండిబాకీలు..
ఎస్‌బీఐ మొండిబాకీలు మార్చి క్వార్టర్‌లో తగ్గాయి. గ్రాస్ ఎన్‌పీఏల రేషియో కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 3.97 శాతంగా, డిసెంబర్ క్వార్ట్‌లో 3.14 శాతంగా నమోదు కాగా, తాజాగా మార్చి క్వార్టర్‌లో 2.78 శాతానికి తగ్గింది. నెట్ ఎన్‌పీఏల రేషియో 0.67 శాతంగా రికార్డయ్యింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో బ్యాంక్ నెట్ ఎన్‌పీఏల రేషియో 1.08 శాతంగా, డిసెంబర్ క్వార్టర్‌లో 0.77 శాతంగా ఉంది. మొండిబాకీలు, కాంటింజెన్సీల కోసం చేసిన ప్రొవిజన్లు భారీగా తగ్గాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో ఎస్‌బీఐ రూ.3,316 కోట్లను ప్రొవిజన్లు, కాంటింజెన్సీల కోసం పక్కనపెట్టింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో కేటాయించిన రూ.7,237 కోట్లతో పోలిస్తే ఇది 54 శాతం తక్కువ. మార్చి క్వార్టర్‌లో చేసిన ప్రొవిజిన్లలో మొండిబాకీల కోసం రూ.1,278 కోట్లు కేటాయించింది.