కేబినెట్ విస్తరణ.. రెండు రోజులు లేట్!

కేబినెట్ విస్తరణ.. రెండు రోజులు లేట్!
  • గవర్నర్ టైం ఇవ్వకపోవడంతో ఆలస్యం
  • పట్నం మహేందర్​రెడ్డి, గంప గోవర్ధన్‌కు మంత్రులుగా చాన్స్
  • మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలో ఒకరిని తప్పించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ విస్తరణ రెండు రోజులు ఆలస్యం కానుంది. బుధవారమే ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. గవర్నర్ టైం ఇవ్వకపోవడంతో ఆ కార్యక్రమం శుక్రవారానికి వాయిదా పడింది. రాష్ట్ర మంత్రివర్గంలోకి పట్నం మహేందర్​రెడ్డి, గంప గోవర్ధన్‌ను తీసుకుంటున్నామని, వారి ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని సీఎంవో నుంచి మంగళవారం రాజ్​భవన్‌కు నోట్​పంపారు. 

బుధవారం ఉదయం 10.30కు మంత్రుల ప్రమాణ స్వీకారానికి గవర్నర్ సమయం ఇచ్చారు. అయితే​తర్వాత దాన్ని రద్దు చేశారు. ఆమె తీవ్ర పంటి నొప్పితో బాధ పడుతుండటంతోనే మంత్రుల ప్రమాణ స్వీకారం వాయిదా వేశారని తెలుస్తున్నది. గురువారం మంచి రోజు కాకపోవడంతో శుక్రవారం మంత్రుల స్వీకారం ఉంటుందని సమాచారం. తాండూరు టికెట్ పైలట్ ​రోహిత్​ రెడ్డికి ఇవ్వడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆశించిన మహేందర్​రెడ్డికి నిరాశ ఎదురైంది.

 దీంతో సీఎం కేసీఆర్​ఆయనను ప్రగతి భవన్​కు పిలిపించి మాట్లాడారు. ఆయన ముందే గవర్నర్‌‌కు ఫోన్ చేసి మంత్రివర్గ విస్తరణకు టైం ఇవ్వాలని అడిగారు. పుదుచ్చేరి నుంచి గవర్నర్ మంగళవారం హైదరాబాద్‌కు రావడంతో బుధవారం ప్రమాణ స్వీకారం ఉంటుందని అనుకున్నారు. అయితే గవర్నర్ డెంటల్ చెకప్‌ కోసం హాస్పిటల్‌కు వెళ్లడం, ఇతరత్రా కారణాలతో బుధవారం టైం ఇచ్చి క్యాన్సిల్​చేశారు.

 

2021 నుంచి ఒక బెర్త్ ఖాళీ

2021 మే రెండో తేదీన కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌‌ను బర్తరఫ్ ​చేశారు. అప్పట్నుంచి 25 నెలలుగా ఈ బెర్త్ ఖాళీగానే ఉంది. ఆయన స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గానికే చెందిన బండ ప్రకాశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని లీకులు ఇప్పించారు. కానీ ఆయనకు మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు. 

ఖాళీగా ఉన్న కేబినెట్ ​బెర్త్​​ను మహేందర్​రెడ్డితో భర్తీ చేయాలని అనుకున్నారు. బీసీ మంత్రిని తప్పించిన స్థానం నుంచి రెడ్డికి అవకాశం ఇస్తే ఎన్నికలకు ముందు ఇబ్బందులు ఎదురవుతాయని కేసీఆర్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ​గజ్వేల్​, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను అక్కడ్నుంచి తప్పించారు.  

ఈటల స్థానంలో గోవర్ధన్‌ను కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. మహేందర్​రెడ్డికి ఇచ్చిన మాట కోసం మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలలో ఎవరో ఒకరితో రాజీనామా చేయించనున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెప్తున్నాయి. 

ఎన్నికలకు ఇంకో 3నెలలే గడువుందని,  ఇప్పుడు మంత్రిగా రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కీలక స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ ఇద్దరిలో ఎవరితో రాజీనామా చేయిస్తారనే దానిపై బీఆర్ఎస్​వర్గాలు స్పష్టత ఇవ్వలేదు.