సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్‌‌‌‌‌‌కు అంతర్జాతీయ గుర్తింపు

సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్‌‌‌‌‌‌కు అంతర్జాతీయ గుర్తింపు
  • సన్నబియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకుగాను ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికెట్

హైదరాబాద్, వెలుగు: ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యుత్తమ సేవలకుగాను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో కార్పొరేషన్ చేపట్టిన వినూత్న చర్యలను గుర్తించిన హెచ్‌‌‌‌వైఎం అంతర్జాతీయ సంస్థ, కార్పొరేషన్‌‌‌‌కు ఐఎస్‌‌‌‌ఓ 9001:2015 సర్టిఫికెట్‌‌‌‌ను అందజేసింది. ఈ సర్టిఫికేట్‌‌‌‌తో పాటు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం విశేషం. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌‌‌‌లోని సివిల్ సప్లయ్స్​ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర  పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్. చౌహాన్ ఈ సర్టిఫికేట్‌‌‌‌ను అందుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందజేయడం, కార్పొరేషన్ అమలు చేసిన సంస్కరణలను హెచ్‌‌‌‌వైఎం సంస్థ అధ్యయనం చేసింది. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ గుర్తింపును అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో చెల్లుబాటయ్యే ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికేట్ పౌర సరఫరాల శాఖ సిబ్బంది సమష్టి కృషికి లభించిన గుర్తింపని అన్నారు. శాఖను అంతర్జాతీయ ప్రమాణాలకు తీర్చిదిద్దిన డి.ఎస్. చౌహాన్‌‌‌‌ను ప్రత్యేకంగా అభినందించారు. చౌహాన్ మాట్లాడుతూ.. ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికేట్‌‌‌‌తో పాటు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం శాఖ పనితీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుందని అన్నారు.