డబ్బు, మద్యం ప్రభావంతోనే ఓట్లు తగ్గినయ్ .. సీపీఎం రాష్ట్ర కమిటీలో చర్చ 

డబ్బు, మద్యం ప్రభావంతోనే ఓట్లు తగ్గినయ్ .. సీపీఎం రాష్ట్ర కమిటీలో చర్చ 
  • ఎన్నికల్లో తీసుకున్న రాజకీయ విధానం కరక్టే 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్న తమ రాజకీయ విధానం కరక్టేననీ సీపీఎం రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. డబ్బు, మద్యం ప్రభావంతోనే అభ్యర్థులకు ఓట్లు తగ్గాయని గుర్తించింది. రెండ్రోజుల పాటు ఎంబీ భవన్​లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాలు గురువారం ముగిశాయి. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయరాఘవన్ సమక్షంలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా19 అసెంబ్లీ స్థానాల్లో 52 వేలకు పైగా ఓట్లు వచ్చాయని సమీక్షలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పలు సెగ్మెంట్లలో ఇతర పార్టీల అభ్యర్థులంతా కలిసి ఒక్కో ఇంటికి రూ.15వేల నుంచి రూ.30వేల వరకూ డబ్బులు పంచారని నేతలు మీటింగ్​లో చెప్పారు. దీంతో పాటు పార్టీ సానుభూతిపరులు, పార్టీ కుటుంబాలు.. సీపీఎం గెలువదనే భావనతో ఇతర పార్టీలకు ఓట్లు వేశారని వివరించారు. ప్రచార సభలకు వచ్చిన జనాన్ని..ఓట్లుగా మలుచుకోలేకపోయామనే దానిపై చర్చ జరిగింది. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు.