
- ఐటీడీఏ పీవో రాహుల్
బూర్గంపహాడ్, వెలుగు : మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లోని కుటుంబాల సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రవేశపెట్టిన ధర్తీ ఆభా యోజనను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ సూచించారు. బుధవారం మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధర్తీ ఆభా యోజన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈ స్కీంలో భాగంగా జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో 130 గ్రామపంచాయతీలను సెలెక్ట్ చేయగా, అందులో కృష్ణ సాగర్ కూడా ఉందన్నారు.
గిరిజన ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధికి ఈ స్కీం ఉపయోగపుతుందని తెలిపారు. ఆధార్, కుల ధ్రువీకరణ, ఓటర్ గుర్తింపు, రేషన్ తదితర కార్డులను అర్హులైన గిరిజనులకు అందిస్తారని చెప్పారు. గతంలో ఇటువంటి కార్డులు తీసుకోవాలంటే తప్పనిసరి మీ సేవ సెంటర్ కు వెళ్లి ఇబ్బందులు పడే వాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వాలే ఈ కార్డులు జారీ చేస్తాయని తెలిపారు.
గురుకుల బాలుర కళాశాల సందర్శన
కృష్ణసాగర్ లోని గురుకుల బాలుర కళాశాలను పీవో సందర్శించారు. సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. పౌష్టికరమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో బాలయ్య, ఎంఏవో కృష్ణయ్య, డాక్టర్ లక్ష్మి, ఏవో శంకర్, ఏపీవో విజయలక్ష్మి, ఆర్ఐ నరసింహారావు, ఐకేపీ ఏపీఎం నాగార్జున, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.