ఉపాధి కూలీల హక్కులు హరిస్తున్న మోదీ సర్కార్..స్కీమ్ నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం: మీనాక్షి నటరాజన్

ఉపాధి కూలీల హక్కులు హరిస్తున్న మోదీ సర్కార్..స్కీమ్ నుంచి గాంధీ పేరు తొలగింపు దారుణం:  మీనాక్షి నటరాజన్
  • మోదీ, అమిత్ షాకు కనువిప్పు కలిగేలా పోరాటం చేస్తాం: పీసీసీ చీఫ్​ మహేశ్ ​గౌడ్
  • మెదక్ జిల్లా కొర్విపల్లిలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ బచావో సంగ్రామ్

మెదక్, చిన్నశంకరంపేట, తిమ్మాపూర్, వెలుగు:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హమీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నదని, కూలీల హక్కులను హరిస్తున్నదని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దారుణమని అన్నారు. 

ఉపాధి హామీ స్కీమ్ రద్దుకు వ్యతిరేకంగా బుధవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లిలో, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని ముంజంపల్లిలో ‘ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ బచావో సంగ్రామ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి, వారితో కలిసి ఆమె భోజనం చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కూలీలకు పనికి తగిన వేతనం అందించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

 ఈ స్కీమ్​కింద గ్రామస్తులే ఊరికి అవసరమయ్యే పనులు చేసుకునేవారిన, కూలీడబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేదన్నారు. ఈ స్కీమ్ ను మోదీ పూర్తిగా మార్చారని, కొత్త చట్టం ప్రకారం ప్రజలు గ్రామానికి అవసరమైన పనులు నిర్ణయించుకునే అవకాశం ఉండదన్నారు. కూలీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్​అండగా ఉంటుందని అన్నారు. 

గ్రామీణ పేదలను ఆదుకునేందుకు సోనియా చొరవతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. ప్రధానికి పేదల బాధలు పట్టడంలేదని ధ్వజమెత్తారు. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని కేంద్రం చేప్తోందని, అప్పుల భారంతో ఉన్న రాష్ట్రం ఈ భారాన్ని ఎలా మోస్తుందని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా ఎత్తేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నేతలు ఈరవత్రి అనిల్, నమిండ్ల శ్రీనివాస్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.