యూసీలు పెట్టరు.. ఫండ్స్ రావు

యూసీలు పెట్టరు.. ఫండ్స్ రావు
  • సెంట్రల్ ఎఫ్​డీఆర్ నిధుల ఖర్చుపై తేల్చని అధికారులు
  • రెండేండ్లలో రూ.16,732 కోట్ల వరద నష్టం
  • కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్న సీఎం రేవంత్ 
  • ముఖ్యమంత్రి ఆదేశించి నెల దాటినా నేటికీ లెక్కలు తేల్చలే

హైదరాబాద్, వెలుగు: కొన్నేండ్లుగా రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక గడిచిన రెండేళ్లలో రూ.16,732 కోట్ల వరద నష్టం వాటిల్లింది. గత బీఆర్ఎస్​ హయాంలో  నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్​​వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్​ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. 

దీంతో ఈసారి ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించి, ఎన్​డీఆర్ఎఫ్​నుంచి నిధులు​రాబట్టాలని సీఎం రేవంత్​ ఆదేశించారు. ఇది జరిగి నెల దాటినా నేటికీ ప్రభుత్వ శాఖల నుంచి లెక్కలు రావట్లేదు. దీంతో గత పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్​ చేసిన ఫ్లడ్  డ్యామేజీ నిధులు, చేసిన ఖర్చు వివరాలపై క్లారిటీ రాలేదు. ఫండ్స్​ లేక కొట్టుకుపోయిన రోడ్లు, తెగిన చెరువులు, కుంటల మరమ్మతు పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పంట నష్టపరిహారం చెల్లింపులు కూడా ఆగిపోయాయి. 

వేల ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో భారీగా వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో ఒకేరోజు 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  వందలాది చెరువులు తెగిపోయాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయి. 30 మందికి పైగా జనం, వేలల్లో పశువులు చనిపోయాయి. 

రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో ఆర్​అండ్​బీ, పంచాయతీ రాజ్, ట్రాన్స్​కోకు వేల కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్, మున్సిపల్​ తదితర శాఖల నుంచి నష్టం వివరాలను తయారు చేసింది. 2024లో రూ.11,713 కోట్లు, 2025లో రూ.5,019 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా నివేదిక తయారుచేసి కేంద్రానికి సమర్పించింది. 

గత నెల 5న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్​షాను కలిసి డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ కింద సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ ఏడాది జూలై, ఆగస్టులో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో నిరాశ్రయులైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి, తాత్కాలిక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు రిలీజ్​ చేసిందని తెలిపారు. 

కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్న సీఎం రేవంత్ 

భారీ వర్షాలతో అతలాకుతమైన కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో సీఎం రేవంత్​ రెడ్డి సెప్టెంబర్ 4న పర్యటించారు. దెబ్బతిన్న పంటలను, కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించి జిల్లా కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. ప్రకృతి విపత్తుల చట్టం కింద కేంద్రం రిలీజ్​ చేసే పద్దు కింద ​నష్టం వివరాలను నమోదు చేసి పనులు చేయించేలా రీఎస్టిమేట్లు చేయాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. 

రాష్ట్రంలో ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పనులు చేయించి బిల్లులు చెల్లిస్తున్నారని, ఈసారి కేంద్ర ప్రభుత్వం అందించే ఫ్లడ్​ డ్యామేజీ నిధుల కింద పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయినా కూడా ఆయా శాఖల అధికారులు రిపోర్టులు రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడంలో ఆలస్యం చేస్తున్నారు. 

ఎటూ తెగని యూసీల లొల్లి

కేంద్ర ప్రభుత్వం ఎప్పట్లాగే  ఫ్లడ్​ డ్యామేజీ కింద నిధులు రిలీజ్​ చేయడానికి ఈసారి యుటిలైజేషన్​ సర్టిఫికేట్లు(యూసీ) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్  కింద 2014 నుంచి 2024 వరకు చేసిన ఖర్చుల వివరాలకు సంబంధించిన యూసీలు ఇవ్వాలని కోరింది. సీఎం కూడా ఆదేశించడంతో ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించారు. 

నెల దాటినా ఏయే శాఖల్లో ఏ హెడ్​ ఆఫ్​ అకౌంట్​ కింద నిధులు ఖర్చు చేశారు? ఇంకా ఎన్ని నిధులు మిగిలి ఉన్నాయో తేల్చలేకపోతున్నారు. దీంతో ఆర్​ అండ్​ బీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, అగ్రికల్చర్, మున్సిపల్​ తదితర శాఖల ఆఫీసర్లు లెక్కలు తీసే పని ప్రారంభించారు. కాగా.. గత బీఆర్ఎస్​ సర్కారు సెంట్రల్​ నుంచి వచ్చిన వరద నష్టం నిధులను ఇతర శాఖలకు మళ్లించడంతో యూసీలు తయారు చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారిందని ఓ అధికారి‘వెలుగు’ కు చెప్పారు.