
- వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేయకండి
- ప్రజలకు సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ చలాన్ల పేరిట సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ‘RTO Traffic Challan.apk 2’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఏపీకే ఫైల్స్‌ను పంపిస్తున్నారని, ఇటువంటి లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ తరహా మెసేజ్‌లు రాష్ట్రవ్యాప్తంగా పలువురికి వస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఈ ప్రమాదకర ఫైల్ లింక్‌లను ఎక్కువగా సాయంత్రం వేళ పంపిస్తున్నారని శిఖా గోయల్ తెలిపారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో వచ్చే ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేస్తే, ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లి, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీకి గురవుతాయని హెచ్చరించారు.
ఈ ఫైల్ ఇన్‌స్టాల్ చేయగానే ఫోన్ రిమోట్‌గా నియంత్రణలోకి వెళుతుందని, ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బు చోరీకి గురవుతుందన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు కూడా రాకుండా చేస్తారని ఆమె తెలిపారు.గుర్తు తెలియని వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని, యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. క్రెడిట్ కార్డులకు ఓటీపీ ఆప్షన్ తప్పనిసరిగా ఎనేబుల్ చేయాలని, అనుమానాస్పద లావాదేవీల సమాచారం తెలిసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా 8712672222 వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు శిఖా గోయల్ సూచించారు.