మున్సిపల్ ఎన్నికలు యధాతథం:ఈసీ

మున్సిపల్ ఎన్నికలు యధాతథం:ఈసీ

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు యధాతథంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, హై కోర్టు సూచనలపై సమీక్షించిన అనంతరం ఎన్నికల ప్రక్రియ వాయిదాకు ఎన్నికల సంఘం నిరాకరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు.. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు మరియు ఎన్నికల ప్రక్రియ కొనసాగింపు పై తమ ఉద్దేశ్యo తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన అనంతరం ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎన్నికలు కొనసాగించాలన్న నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కు కట్టుబడి ఉందని స్పష్టం చేసిందని.. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ..  కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని స్పష్టం చేసినందున ఎన్నికల వాయిదా అవసరం లేదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న ప్రక్రియ మధ్యలో ఆపకుండా  యధాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఈ సూచన మేరకు సంబందిత అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో నిబంధనలను విడుదల చేస్తూ ప్రతి ఒక్కరు ఈ ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి కోరారు.