‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు

‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు

సిద్ధిపేట: దేశంలో దళితులకు పది లక్షలు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో ఓ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులతో కలిసి దళిత బంధు చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళిత బంధు పథకంతో సీఎం కేసీఆర్ దళితుల ఆర్ధికాభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఈ ఏడాది చివరి కల్లా మరో 1700 మందికి దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.

అంబేద్కర్ కలలు కన్న నిజమైన ఆర్థిక, సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. గతేడాది రాష్ట్రానికి రావాల్సిన రూ.1200 కోట్లు కేంద్రం ఎగ్గొట్టిందని, దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణకు నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే రఘునందన్ రావుకు సవాలు విసిరారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పినా... రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సిద్ధమైందన్నారు. త్వరలోనే 55 సంవత్సరాలు నిండినవారికి పెన్షన్ మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 

మరిన్ని వార్తల కోసం...

వైభవంగా మధుర మీనాక్షి కళ్యాణ వేడుకలు

రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందించిన భగవంత్ మాన్