- అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏర్పాటుకు ప్లాన్
- కీలక ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరా ట్రాప్స్
- వన్యప్రాణులు, వేటగాళ్ల కదలికలు ఎప్పటికప్పుడు మానిటరింగ్
- ప్రభుత్వ ఆమోదం కోసం
- అటవీ శాఖ ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతో పాటు వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు అటవీశాఖ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత నిఘా వ్యవస్థ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ఇటీవల పులులు, చిరుతల సంచారం పెరిగిపోయింది. దీంతో వన్యప్రాణుల కదలికలు తెలుసుకోవడం, వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడడంతో పాటు కలప అక్రమ రవాణాకు, అటవీ ఆక్రమణలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రత్యేక వ్యవస్థను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మొదట అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో అత్యాధునిక కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించినట్లు తెలిసింది.
24 గంటలు నిఘా పెట్టేలా..
అమ్రాబాద్, కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాల్లో పులులతో పాటు చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారం పెరిగిపోతోంది. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 2,015.44 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంటగా, అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 2,611.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అడవుల్లో ప్రతి అడుగును పర్యవేక్షించడం సిబ్బందికి సవాల్‌గా మారింది. అందుకే టెక్నాలజీ సాయంతో 24 గంటలూ నిఘా పెట్టేలా అత్యాధునిక కెమెరా ట్రాప్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అడవిలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలు, నీటి కుంటలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏఐ ఆధారంగా పనిచేసే స్మార్ట్ కెమెరాలను అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మనుషుల కదలికలు కనిపిస్తే అలర్ట్ మెసేజ్
ఇప్పటివరకు అడవుల్లో అమర్చే సాధారణ కెమెరా ట్రాప్స్ కేవలం చిత్రాలను మాత్రమే రికార్డు చేస్తాయి. కానీ ప్రస్తుతం ప్రతిపాదించిన ఏఐ ఆధారిత కెమెరాలు.. అడవిలో మనుషుల కదలికలు కనిపించినా, అనుమానాస్పద వాహనాలు వచ్చినా... వెంటనే ఆఫీసర్ల మొబైల్‌కు, కంట్రోల్‌రూమ్స్‌కు హెచ్చరికలు పంపిస్తాయి. రాత్రివేళల్లో సైతం మనుషులు, జంతువులను స్పష్టంగా గుర్తించే సామర్థ్యం ఈ కెమెరాలకు ఉంటుంది. వేటగాళ్లు పట్టుబడినప్పుడు నేరాన్ని నిరూపించేందుకు ఈ ఫుటేజీ సాక్ష్యంగా ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
ఆక్రమణలకు చెక్..
అడవుల్లో చెట్ల నరికివేత, పోడు సాగు కోసం జరిగే ఆక్రమణలను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. అటవీ సరిహద్దుల వెంబడి ఈ నిఘా కెమెరాలు నిరంతరం కాపలా కాస్తాయి. ఎక్కడైనా అడవిని నరికే ప్రయత్నం జరిగినా, భూమిని దున్నే శబ్దాలు వచ్చినా సెన్సార్లు గుర్తించి ఆఫీసర్లను అప్రమత్తం చేయనున్నాయి.
అటవీశాఖ పంపిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే దక్షిణ భారతదేశంలోనే అత్యాధునిక నిఘా వ్యవస్థ కలిగిన అడవులుగా అమ్రాబాద్, కవ్వాల్ నిలవనున్నాయి. తక్కువ సిబ్బందితో ఎక్కువ విస్తీర్ణాన్ని పర్యవేక్షించడమే కాకుండా ప్రకృతి సంపదను భావితరాలకు అందించడంలో ఈ సాంకేతికత కీలకంగా మారుతుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
