టెట్ ఇక ఏటా రెండు సార్లు

టెట్ ఇక ఏటా రెండు సార్లు
  • జూన్, డిసెంబర్​లో నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రతి ఏటా జూన్, డిసెంబర్ /జనవరిలో నిర్వహించేలా స్పెషల్ షెడ్యూల్​ ఖరారు చేసింది. గతంలోనే నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ (ఎన్​సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్‌‌‌‌  నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. 

కానీ, గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఆ ఆదేశాలు అమలు చేయలేదు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ టెట్ గడువును జీవితకాలానికి పెంచింది. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు. టెట్ నిర్వహణకు సుమారు 90 రోజుల టైమ్ పట్టే అవకాశం ఉంది. దీంతో ముందుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసే చాన్స్​ ఉంటుంది. 

ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి

ఇప్పటి వరకు డీఈడీ, బీఈడీ తదితర కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. కానీ, ఎన్​సీటీఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. ఈ రూల్​ రాష్ట్రంలో ఇక నుంచి అమలు కానున్నది. దీంతో ఇకపై రాసే అన్ని  టెట్ ఎగ్జామ్స్​కు నిరుద్యోగ అభ్యర్థులతో పాటు ప్రమోషన్లు పొందాలనుకునే టీచర్లూ రాయాల్సి ఉంటుంది. 

ఈసారి డీఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. కానీ.. టెట్, డీఎస్సీకి సంబంధం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు మూడ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. టెట్ ఇక నుంచి నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు.