
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతికి బీసీ బిల్లులు పంపి 5 నెలలు కావొస్తున్నది.
గవర్నర్‌కు పంచాయతీరాజ్ చట్టం –2018 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా పంపి నెల దాటింది. దానిని కూడా రాష్ట్రపతికి పరిశీలనకు పంపారు. ఇటీవల రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. ఇందులో రాష్ట్రపతికి 3 నెలలు, గవర్నర్‌కు నెల సమయమే ఉన్నది. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతున్నది. ఈ కేసులోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కానున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు లాయర్లను కూడా నియమించినట్లు సమాచారం.
పీఏసీ నియమించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో కూడిన కమిటీ కూడా రిజర్వేషన్లపై ఆదివారం ప్రజా భవన్‌లో సమావేశమైంది. ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడం, ఇంకోవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉండటంతో ఏం చేయాలనే దానిపై చర్చించారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా సలహా ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయం కోరారు. ఇదే అంశంపై సోమవారం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి , ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం సైతం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. కమిటీ సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డికి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు..
ఉస్మానియా యూనివర్సిటీలో రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓయూలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టళ్లను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
రూ.10 కోట్ల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులను ప్రారంభించను న్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ‘తెలంగాణ విద్యా రంగంలో మార్పులు– ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై సీఎం ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.