మహనీయులను మరిచిన సర్కారు

మహనీయులను మరిచిన సర్కారు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహనీయులను యాది మరుస్తున్నది. ఇప్పటికే కరోనా సాకుతో కొందరు నేతల జయంతి ఉత్సవాలను బంద్‌ చేసిన రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు మరికొందరి ఉత్సవాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది. స్టేట్‌ ఫెస్టివల్‌ పేరుతో జీవోలు రిలీజ్‌ చేస్తున్నా.. వాటిని కాగితాలకే పరిమితం చేస్తున్నది. ఉత్సవాలకు సంబంధించిన నిర్వహణ కమిటీ వేయడంలేదు. ఏర్పాట్లకు ఒక్క పైసా రిలీజ్ చేయడంలేదు. ట్యాంక్‌ బండ్‌పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రకటించినా.. ఏడేండ్లలో ఒక్కటీ పెట్టలేదు.

పేరుకే స్టేట్ ఫెస్టివల్

సాధారణంగా స్టేట్‌ ఫెస్టివల్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. వారి సేవలను స్మరించుకుంటారు. ఉత్సవాల కంటే కొన్ని రోజుల ముందే నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి, ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేస్తారు. హైదరాబాద్‌లో 20 లక్షలు, జిల్లాల్లో లక్ష చొప్పున ఖర్చు చేస్తారు. సంబంధిత మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు పాల్గొంటారు. కానీ వీరనారి చాకలి ఐలమ్మ (26న జయంతి), స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ (27న జయంతి) జయంతి ఉత్సవాలకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఫండ్స్‌ రిలీజ్‌ చేయలేదు. ఉన్నది రెండు, మూడు రోజులే. కానీ సర్కారు పట్టించుకోలేదు. బహుజన మహనీయుల ఉత్సవాలపైనే ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

రెండేండ్ల నుంచి..

కరోనా సాకుతో రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా బహుజన మహనీయుల ఉత్సవాలను నిర్వహించడమే బంద్‌ చేసింది. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ వంటి నేతల ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలేదు. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, మిని మున్సిపోల్స్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక జరిపింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, వాల్మీకి జయంతి ఉత్సవాలు సరిగ్గా నిర్వహించలేదు. అయితే ఇదే సమయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాలను మాత్రం ఏడాది పొడవుగా ఘనంగా నిర్వహించడం గమనార్హం.

విగ్రహాల ఏర్పాటు మాటలకే పరిమితం

తెలంగాణ ఏర్పడక ముందు ట్యాంక్‌ బండ్‌పై మొత్తం ఏపీకి చెందిన మహనీయుల విగ్రహాలనే ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్‌ సందర్భంగా వాటిలో కొన్ని ధ్వంసమయ్యాయి. తెలంగాణ వస్తే తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెడతామని టీఆర్ఎస్ ప్రకటనలు చేసింది. ‘ట్యాంక్‌ బండ్‌తో సహా వివిధ ప్రాంతాల్లో తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తం’ అని 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టింది. కానీ ఏడేండ్లు దాటినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, జ్యోతిబా పూలే, కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని పదేపదే సీఎం హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయి.

జీవోలు రిలీజ్ చేసి మమ అనిపిస్తున్రు

రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాల పేరుతో జీవో రిలీజ్‌ చేసి మమ అనిపిస్తోంది. ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉత్సవాలపై ఇంకా కమిటీలు ఏర్పాటు చేయలేదు. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బహుజన మహనీయులను అవమానపరిచేలా వ్యవరిస్తున్నరు. రాజకీయ పార్టీల బహిరంగ సభలు, ఎలక్షన్ ప్రచారాలు, పాదయాత్రలు చేస్తే రాని కరోనా రవీంద్రభారతిలో వెయ్యిమందితో జయంతి చేస్తే వస్తుందా? అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తే రాదా? ప్రభుత్వం తీరు మార్చుకోవాలి.
‑ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, తెలంగాణ 
బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌