మెడికల్​కాలేజీలకు దరఖాస్తే చేయని రాష్ట్ర సర్కార్

మెడికల్​కాలేజీలకు దరఖాస్తే చేయని రాష్ట్ర సర్కార్
  • ఈటలతో విభేదాలతో డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తొక్కిపెట్టిన సీఎంవో
  • ప్రపోజల్స్ రాలేదని రెండేండ్ల కిందటే కేంద్రం వెల్లడి
  • అప్పుడు సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉండి.. ఇప్పడు లొల్లి చేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్ల లెక్కనే కేంద్రంతో మరో పంచాయితీకి రాష్ట్ర సర్కార్ తెరలేపింది. దేశంలోని అన్ని రాష్ట్రలకూ మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు ఇవ్వలేదని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని ఇటీవలే పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కేంద్ర ఆరోగ్య మంత్రిని ప్రశ్నించారు. సెంట్రల్ స్పాన్సర్డ్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపించలేదని, అందుకే తాము ఇవ్వలేదని కేంద్ర మంత్రి ఆన్సర్ ఇచ్చారు. కేంద్రం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ సాక్షిగా అబద్దాలు చెబుతోందని మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని 2019, ఆగస్ట్ నెలలో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసిన లేఖకు, అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ఇచ్చిన రిప్లై లేఖను హరీశ్‌‌‌‌‌‌‌‌ ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రం ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపినా, కేంద్రం కాలేజీలు మంజూరు చేయలేదని చెప్పడానికి ఈ లేఖను హరీశ్‌‌‌‌‌‌‌‌ వాడారు. కానీ, వాస్తవానికి అసలు రాష్ట్ర సర్కార్ కేంద్రానికి ప్రతిపాదనలే పంపలేదని మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆఫీసర్లు చెబుతున్నారు. పంపితే కనీసం 3 నుంచి 5 కాలేజీలు వచ్చేవని, అప్పుడున్న రాజకీయ కారణాలతో తాము రూపొందించిన డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సైతం పక్కన పెట్టారని ఆఫీసర్లు చెబుతున్నారు.

అసలేంటీ స్కీమ్

దేశంలోని వెనకబడిన జిల్లాల్లో ప్రధాన హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ స్కీమ్‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చింది. ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. తొలి 2 దశల్లో ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు కాలేజీలు మంజూరు చేశారు. మూడో దశలో సౌత్ రాష్ట్రాలకు కాలేజీలు మంజూరు చేశారు. అయితే ప్రపోజల్స్ పంపకుండా మన సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఈ విషయాన్ని రెండేండ్ల కిందటే కేంద్ర పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించింది. మూడో దశలో మెడికల్ కాలేజీల కోసం ఏయే రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపించాయో చెప్పాలని కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ 2020, ఫిబ్రవరి ఏడో తేదీన కేంద్రాన్ని కోరారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. 2020, ఫిబ్రవరి నాలుగో తేదీ నాటికి 17 రాష్ట్రాల నుంచి 89 ప్రపోజల్స్ వచ్చాయని, ఇందులో 57 ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ అప్రూవ్ అయ్యాయని, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని ప్రకటించింది. రాష్ట్రాల వారీగా ప్రతిపాదనల వివరాలను రాతపూర్వకంగా వెల్లడించింది. ఇందులో తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా లేదు. దీన్ని బట్టి కేంద్ర మంత్రి లేఖ ప్రపోజల్స్ పంపాలని సూచించిన ఐదు నెలల తర్వాత కూడా మన రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపలేదని స్పష్టం అవుతోంది. గతేడాది ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా తెలంగాణకు ఎందుకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. అప్పుడు కూడా తెలంగాణ నుంచి ప్రపోజల్స్ రాలేదని కేంద్ర ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

అసలు ఎందుకు పంపలేదు?

ఖమ్మం, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడికల్ కాలేజీల కోసం 2019లో ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. కాలేజీల మంజూరుకు  కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అప్పుడు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు కరీంనగర్, ఖమ్మం సహా 5 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం అధికారులు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సిద్ధం చేశారు. వీటిని సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించారు. సీఎంవో నుంచి అసలు ఆ ఫైల్స్ వెనక్కి రాలేదని అప్పట్లో ఆఫీసర్లు చెప్పారు. అప్పటికే ఈటలకు, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య ఉన్న రాజకీయ విభేదాలతోనే ఈ ప్రపోజల్స్ పక్కన పెట్టినట్టు డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రచారం జరిగింది.  ఈ రాజకీయాల వల్లే మన  రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని ఆఫీసర్లు చెబుతున్నారు. మెడికల్ కాలేజీల కోసం ప్రపోజల్స్ పంపినా అన్ని రాష్ట్రాలకు కేంద్రం కాలేజీలు మంజూరు చేసింది. ఏపీ 7 కాలేజీలకు ప్రపోజల్స్ పంపితే 3 కాలేజీలు ఇచ్చింది.