బీసీ హాస్టళ్లలో సౌకర్యాలపై సర్కారు ఆరా

బీసీ హాస్టళ్లలో సౌకర్యాలపై సర్కారు ఆరా
  • జిల్లాల్లో బీసీ వెల్ఫేర్  కమిషనర్  పర్యటన 
  • 33 జిల్లాల్లో పర్యటించి సర్కారుకు నివేదిక ఇవ్వనున్న అధికారులు
  • భవనాల నిర్మాణంపై లోక్ సభ ఎన్నికల తర్వాత నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బీసీ హాస్టల్స్ లో సౌకర్యాలపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. అన్ని జిల్లాల్లో ఉన్న హాస్టళ్లలో వసతులను పరిశీలించి వాటిలో ఉన్న ఇబ్బందులపై త్వరలో సర్కారుకు అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. గత నెలలో బీసీ వెల్ఫేర్  కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన బాలమాయదేవి జిల్లాల్లో పర్యటిస్తూ స్టూడెంట్లు, స్టాఫ్ తో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే 5 జిల్లాల్లో ఆమె పర్యటించగా ఎన్నికల కోడ్  ముగిసే నాటికి అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని అధికారులు చెబుతున్నారు. 

కొత్త బిల్డింగ్ ల కోసం రూ.1500 కోట్లు 

బీసీ సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఇటీవల ఓటాన్  అకౌంట్  బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయించింది. వాటికి త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సొంత భవనాల్లో కొనసాగుతున్న స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో వసతులు, సమస్యలపై  నివేదిక సిద్ధం చేయనున్నారు. మేజర్, మైనర్  రిపేర్లు, టాయిలెట్స్, క్లాస్ రూంలు, హాస్టల్స్ లో వసతులపై వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ  ఆధీనంలో మొత్తం 700 స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ ఉండగా వాటిలో 313 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో సుమారు 50 వేల మంది పైనే స్టూడెంట్లు  చదువుతున్నారు. బీసీ గురుకులాల్లో  స్కూల్స్, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టల్స్  మొత్తం 327 ఉండగా వాటిలో 1,87,280 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇక అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటి స్థానాల్లో  సొంత భవనాలు నిర్మించాల్సి ఉండగా వాటికి ఎంత భూమి అవసరం, జాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న వివరాలను అధికారులు రెడీ చేస్తున్నారు.

అన్ని క్యాంపస్ లు ఒకే దగ్గర

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల బిల్డింగ్ లను ఒకే క్యాంపస్ లో నిర్మిస్తామని సీఎం రేవంత్  రెడ్డి ఇటీవల ప్రకటించారు. సొంత భవనాలు ఉన్న దగ్గర ఎక్కడ ఎంత జాగా అందుబాటులో ఉందో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తొలి దశలో పైలట్  ప్రాజెక్టుగా  కొడంగల్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో భవనాలు నిర్మించేందుకు ప్లాన్  చేస్తున్నారు.  ఈ రెండు ప్రాంతాలను కూడా కమిషనర్  బాలమాయదేవి త్వరలో సందర్శించి అక్కడ ఉన్న హాస్టళ్లను పరిశీలించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్లతో 100 భవనాలు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి ఇటీవల ప్రకటించారు. వాటి నిర్మాణానికి ప్లాన్లపై బెంగళూరుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్   కంపెనీ డిప్యూటీ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్  ఇచ్చింది. మధిర నియోజకవర్గంలో హాస్టల్  ఉన్న ప్రాంతంలో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని అధికారులు గుర్తించి సర్కారుకు నివేదిక ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత వాటి నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.