గరీబ్ కల్యాణ్ కింద అదనపు రేషన్

గరీబ్ కల్యాణ్ కింద అదనపు రేషన్

గరీబ్ కల్యాణ్ కింద అదనపు రేషన్
ఈనెల 5 నుంచి బియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్  
12 నెలలు కొనసాగింపు.. 92 లక్షల కుటుంబాలకు లబ్ధి 

హైదరాబాద్‌‌, వెలుగు : ప్రధాన మంత్రి గరీబ్‌‌ కల్యాణ్‌‌ యోజనలో కేంద్రం పొడిగించిన అదనపు ఉచిత రేషన్‌‌ ను అందించేందుకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. జనవరి నుంచి 12 నెలల పాటు దేశవ్యాప్తంగా అదనంగా 5 కిలోల రేషన్  ఉచితంగా అందించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు దీన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫుడ్‌‌ సెక్యూరిటీ కార్డులకు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 5 కిలోల రేషన్ ఉచితంగా అందించనున్నారు. అంత్యోదయ కార్డులకు కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు10 కిలోలు ఉచితంగా ఇవ్వనున్నారు. అలాగే కుమ్రంభీమ్‌‌ ఆసిఫాబాద్‌‌, భూపాలపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో మామూలు బియ్యానికి బదులుగా ఫోర్టిఫైడ్‌‌ రైస్‌‌ అందించనున్నారు.  

అదనపు కోటా పంపిణీ ఇలా.. 

రాష్ట్ర సర్కారు కిలో రూపాయి చొప్పున కుటుంబంలో ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేది. కానీ అదనపు రేషన్‌‌ కోటా అమలు చేసే నాటి నుంచి సాధారణంగా ఇచ్చే 6 కిలోల రేషన్‌‌ను 5 కిలోలకు తగ్గించింది. దీనికి అదనంగా కేంద్రం అదనపు కోటా కింద ఇచ్చే 5 కిలోలు కలిపి ప్రతి నెల కుటుంబంలో ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత రేషన్‌‌ అమలు చేస్తూ వచ్చింది. అయితే ఈ నెల నుంచి అమలు చేస్తున్న అదనపు కోటా 5 కిలోలతో పాటుగా10 కిలోలు ఉచితంగా అందిస్తుందా? లేదా? అనేది 5 తేదీన తేలనుంది.