సీఎస్తో పంచాయతీ ఆఫీసర్ల భేటీ

సీఎస్తో పంచాయతీ ఆఫీసర్ల భేటీ
  • స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కార్యాచరణ 
  • కేబినెట్‌‌కు నోట్​ ఫైల్​ రెడీ చేయాలన్న సీఎస్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. బుధవారం సీఎస్​ రామకృష్ణారావుతో పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖల ప్రిన్సిపల్​ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్​ సృజనతో కీలక భేటీ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నది. దీంతోపాటు స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.3 వేల కోట్లు నిలిచిపోయాయి. 

బ్యాలెట్​ బాక్సులు, బ్యాలెట్​ పత్రాలు జిల్లాలకు చేరుకుని నెలులు గడుస్తున్నది. ఈ క్రమంలో వాటి భద్రతపై సీఎస్‌‌ ఆరా తీసినట్లు సమాచారం. సిబ్బంది శిక్షణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. త్వరలో క్యాబినెట్​ సమావేశం జరగనుండటంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోట్​ ఫైల్​ రెడీ చేయాలని సీఎస్​ పంచాయతీ ఆఫీసర్లకు ఆదేశించారు. దీనికితోడు ఈ నెల 24న హైకోర్టులో స్థానిక ఎన్నికల కేసు విచారణకు రానున్నది. ఎన్నికలపై ప్రభుత్వం తరఫున కోర్టుకు అందించాల్సిన రిపోర్టుపైనా చర్చించినట్లు సమాచారం. 

ఈ సారి క్యాబినెట్​ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించే అవకాశం ఉండటంతో అందుకు సంబంధించిన పూర్తిస్థాయిలో నోట్​ ఫైల్​ ప్రిపేర్​ చేయాలని సీఎస్​ చెప్పినట్లు తెలిసింది. పంచాయతీల్లో ఇబ్బందులు, కేంద్ర నుంచి రావాల్సిన ఫండ్స్​ వివరాలు, ఎన్నికలు ఆలస్యం అవుతున్న కొద్దీ గ్రామాల్లో తలెత్తే సమస్యలు, తదితర అంశాలపై పూర్తిస్థాయి నోట్​ ఫైల్​ రెడీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.