హైదరాబాద్కు కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి

హైదరాబాద్కు కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి
  • సైబరాబాద్​కు అవినాశ్​ మహంతి, రాచకొండకు సుధీర్ బాబు
  • సీఎం సెక్రటరీగా షానవాజ్ ఖాసీం నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మూడు కమిషనరేట్లకు కొత్త సీపీలను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్​గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్​గా ఉన్న సుధీర్ బాబును రాచకొండ సీపీగా అపాయింట్ చేసింది. అదేవిధంగా, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ (అడ్మిన్)గా ఉన్న అవినాష్ మహంతిని సైబరాబాద్ సీపీగా నియమించింది.

ఎన్నికల టైమ్​లో హైదరాబాద్ సీపీగా నియమితులైన సందీప్ శాండిల్యాకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా షానవాజ్ ఖాసీం నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2003 ఐపీఎస్ బ్యాచ్​కు చెందిన షానవాజ్.. ఇప్పటి దాకా హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్‌‌ చౌహాన్​ను డీజీపీ ఆఫీస్​లో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

నిజాయతీగల అధికారిగా శ్రీనివాస్ రెడ్డికి పేరు

1994 బ్యాచ్‌‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి నిజాయతీ గల అధికారిగా పేరుంది. రాష్ట్రంలో ఎక్కువ సార్లు బదిలీ అయిన పోలీస్ అధికారి కూడా ఆయనే. ముక్కు సూటితనంతో ముందుకెళ్లే ఆయన.. కెరీర్లో ఎక్కువ కాలం పాటు లూప్​లైన్ పోస్టింగ్​లలోనే ఉండాల్సి వచ్చింది. గతంలో ఓ మంత్రికి లిక్కర్ సిండికేట్లలో ప్రమేయం ఉందనే విషయాన్ని బయటపెట్టడంలో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన ట్రాన్స్​ఫర్ తర్వాత ఆ కేసు ముందుకు సాగలేదు.