పరిహారం అందింది కొన్ని రైతు కుటుంబాలకే

పరిహారం అందింది కొన్ని రైతు కుటుంబాలకే
  • మిగతా రైతు కుటుంబాలు ఇప్పటికీ దీనావస్థలోనే
  • 500 కుటుంబాల్లో 243 కుటుంబాలకే ఎక్స్​గ్రేషియా
  • అది కూడా కోర్టులో పిటిషన్‌‌ వేస్తేనే విడుదల చేశారంటున్న రైతు సంఘాలు
  • ఎక్స్‌‌గ్రేషియా కోసం మిగతావారి ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొసరికొసరి ఇస్తోంది. రైతు ఆత్మహత్యలపై విచారణ జరిపే త్రీమెన్‌‌ కమిటీ అధికారికంగా గుర్తించిన కుటుంబాలకు కూడా ఎక్స్‌‌గ్రేషియాను సకాలంలో అందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సుమారు 500 మంది బాధిత రైతు కుటుంబాల్లో 243 మందికి మాత్రమే పరిహారం విడుదల చేయడంపై మిగతా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పైసలు ఇచ్చేందుకు సర్కార్​ దగ్గర పైసలు లేవా అని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 మందికి ఎక్స్ గ్రేషియా రావాల్సి ఉండగా కేవలం ముగ్గురికే  ఎక్స్ గ్రేషియా మంజూరైంది. మంచిర్యాల జిల్లాలో ఏడు కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తుంటే ఒక్క కుటుంబానికి కూడా ఎక్స్ గ్రేషియా రాలేదు.  మరోవైపు ఎక్స్‌‌గ్రేషియా మంజూరైన 243 మందిలో తమ పేరు ఉందో లేదో అని తెలుసుకునేందుకు రైతు కుటుంబాలు కలెక్టర్‌‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వ్యవసాయానికి ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులు, నకిలీ విత్తనాలు, వర్షాభావ పరిస్థితులు, పండిన పంటకు అందని గిట్టుబాటు ధర వంటి ఎన్నో కారణాలతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెలంగాణ ఏర్పడిన 2014 జూన్‌‌ 2 నుంచి 2017 అక్టోబర్‌‌ 9 వరకు 2,066 మంది రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. వాటిలో 1,808 మంది రైతు ఆత్మహత్యలను విచారించిన త్రిసభ్య కమిటీ 1,149 మంది రైతు ఆత్మహత్యలు వాస్తవమైనవిగా తేల్చింది.

విడతలవారీగా సాయం

తహసీల్దార్‌‌, ఎస్సై, మండల వ్యవసాయాధికారితో కూడిన త్రిమెన్‌‌ కమిటీ నిర్ధారించిన 1,149 కుటుంబాల్లో మొదటి విడతా 389 మందికి   2016 మే 21న పరిహారం విడుదల చేశారు. మరో 457 మందికి 2017 అక్టోబర్‌‌ 9-న  ఎక్స్‌‌గ్రేషియా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ధారించిన రైతు ఆత్మహత్యల్లోనే  ఇంకా 303 మందికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని 2017లోనే అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత 2017 ఆగస్టు 31 నుంచి 2018 ఆగస్టు 14 (రైతు బీమా వచ్చేంత వరకు) మరో 190 మంది రైతు ఆత్మహత్యలను గుర్తించినట్లు తెలిసింది. ఇలా సుమారు 500 మంది రైతు కుటుంబాలు ఎక్స్‌‌గ్రేషియా కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం 243 రైతు కుటుంబాలకే ఈ నెల 1న పరిహారం విడుదల చేసింది. మిగతా 257 కుటుంబాల వారికి కూడా వెంటనే సాయం అందజేయాలని  రైతు సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.

కోర్టు మెట్లు ఎక్కాకే పరిహారం

కోర్టు మెట్లు ఎక్కితేగానీ ప్రభుత్వం స్పందించడం లేదని ఈ సమస్యపై గత కొన్నేండ్లుగా పనిచేస్తున్న రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్‌‌ కొండల్‌‌ రెడ్డి, మానవ హక్కుల వేదిక నాయకుడు నంద్యాల హరిచందర్‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగివేసారిన నల్గొండ జిల్లా బాధిత కుటుంబాల మహిళలతో కలిసి వారు హైకోర్టులో పిటిషన్‌‌ (94/2019) దాఖలు చేశారు. ఈ కేసులో కోర్టు  నోటీసులు అందిన తర్వాతే  ప్రభుత్వం స్పందించిందని వారు తెలిపారు. కనీసం 243 మందికైనా పరిహారమివ్వడం సంతోషమని, కానీ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ప్రభుత్వం గుర్తించిన కుటుంబాలతో పాటూ ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి పరిహారమివ్వాలని డిమాండ్‌‌ చేశారు. రైతు బీమా వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడమే లేదన్నారు. రైతు బీమాలో సమస్యలున్నాయని, కౌలు రైతులకు, భూమి తమ పేరున లేని మహిళా రైతులు, యువ రైతులు చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా బీమా వర్తించడంలేదని వాపోయారు.

ఆదుకునే దిక్కేది?

ఈ ఫొటోలో ఉన్నది కొండగొర్ల తిరుపతి, భూదేవి దంపతులు, వారి పిల్లలు కీర్తన, శ్రీశాంత్‌‌. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం చొప్పరిపల్లెకి చెందిన ఈ దంపతులు వ్యవసాయం కోసం సుమారు 6.50 లక్షల అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక గత ఏడాది మార్చి1న తిరుపతి, భూదేవి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తిరుపతి ఉరివేసుకోగా.. భూదేవి పురుగు మందు తాగింది. పిల్లలు కీర్తన, శ్రీశాంత్‌‌కు నిద్రమాత్రలు ఇచ్చారు. దంపతులు చనిపోగా.. అదృష్టవశాత్తూ వారి పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబానికి ఇప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదు. అనాథలుగా మారిన ఈ పిల్లలకు పదిహేను రోజుల్లో ఎక్స్‌‌గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చిన అధికారులు అటు తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాది కాలంగా  సాయం కోసం ఎదురుచూస్తున్నా.. వారి పేరు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల ఎక్స్​గ్రేషియా జాబితాలో కూడా లేదు. గతంలో తమ పరిహారం విషయమై ఆర్టీఐ కింద వీరు సమాచారం కోరితే ‘నో బడ్జెట్‌‌’ అని సమాధానమిచ్చారు. ఇది ఒక్క కీర్తన, శ్రీశాంత్‌‌ సమస్యే కాదు. రాష్ట్రంలోని సుమారు 250 రైతు కుటుంబాలు ఇదే బాధను అనుభవిస్తున్నాయి.

వడ్డీతోపాటు చెల్లించాలి 

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న  రైతుల కుటుంబాలకు ఎక్స్‌‌గ్రేషియా  ఇవ్వడానికి బడ్జెట్ లేదనడం చాలా దారుణం. మంచిర్యాల,  భువనగిరిలాంటి జిల్లాల్లో ఒక్క కుటుంబానికి కుడా ఎక్స్ గ్రేషియా అందలేదు. కనీసం కలెక్టర్‌‌ సీబీఎఫ్‌‌ నుంచైనా బాధిత కుటుంబాలకు తక్షణం పరిహారమివ్వాలి. సాంకేతిక కారణాలతో త్రిసభ్య కమిటీ రైతు ఆత్మహత్యగా గుర్తించని కుటుంబాల జీవనోపాధిని కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. కుటుంబాలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం వడ్డీతోపాటు ఎక్స్ గ్రేషియా చెల్లించే వరకు న్యాయపోరాటం చేస్తాం.

– బి.కొండల్​రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక, కో కన్వీనర్