
- హైకోర్టు చెప్పినా జీవోలు దాసుడే
- తీరు మార్చుకోని రాష్ట్ర సర్కార్
- ఇబ్బందులు, విమర్శలు వస్తాయని ఉత్తర్వులు బయటపెడ్తలే
- ఏటా సగటున 20 వేల జీవోలిస్తే 15 వేల దాకా సీక్రెటే
- ముఖ్యమైన నిర్ణయాలు, నిధులు, ప్రాజెక్టుల వివరాలు
- వెబ్‌సైట్‌లో కనిపిస్తలే ఆరేండ్లలో 96,112 జీవోలు
- దాచిపెట్టిన ప్రభుత్వం ఏటా తగ్గుతున్నయ్
Goir.telangana.gov.in వెబ్‌సైట్‌లో పెడుతున్న జీవోల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం వచ్చినప్పుడు 2015లో 21,702 జీవోలు పెట్టారు. అంతకుముందు 2014 జూన్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 31 నాటికి 10,282 జీవోలు అప్‌లోడ్ చేశారు. 2016లో 13,249 జీవోలు.. 2017లో 8,761.. 2018లో 6,858.. 2019లో 4,701.. 2020లో 4,207.. 2021లో 4,315 జీవోలు వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 1,954 జీవోలు మాత్రమే అప్ లోడ్ చేశారు.
హైదరాబాద్, వెలుగు: జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ఏటా సగటున 20 వేల జీవోలను ఇష్యూ చేస్తున్నా.. అందులో 5 వేల లోపు మాత్రమే ‘జీవోఐఆర్’ సైట్‌లో పెడుతోంది. అంటే 15 వేల జీవోలను రహస్యంగా ఉంచుతోంది. ఆరేండ్ల నుంచి ఇదే తంతు నడుస్తోంది. ముఖ్యమైన పాలసీ నిర్ణయాలు, నిధుల విడుదలకు సంబంధించినవి, పలు కంపెనీలకు భూ కేటాయింపులు, ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించిన కీలకమైన ఉత్తర్వులేవీ బయటపెట్టడం లేదు. గత నెలలో వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఇచ్చిన జీవో కూడా నాలుగు రోజుల తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఆ ఉత్తర్వులను ఇప్పటికీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్న జీవోలు కూడా సీక్రెట్‌గా ఉంచుతున్నారు.
ఈ ఏడాది ఆరు నెలల కాలంలో దాదాపు 184 ఎకరాల భూములు వివిధ కంపెనీలకు ప్రభుత్వం కేటాయించింది. వాటి ఉత్తర్వులనూ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఇటీవలి భారీ వర్షాలకు, వరదలకు సంబంధించి పునరావాస కేంద్రాలు, రోడ్ల మరమ్మతులు, ఇతర అవసరాలకు ఇచ్చిన నిధుల జీవోలు బయటకు రాలేదు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతుల జీవోల్లో చాలా వరకు సైట్‌లో కనిపించడం లేదు. ఉద్యోగుల సర్వీస్, ఇతర పాలసీలకు సంబంధించి ఏదైనా జీవో వస్తే.. సంబంధిత ఉద్యోగుల్లో ఎవరైనా వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తేనే బయటకు తెలుస్తోంది. ప్రజలకు మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 1,72,241 జీవోలు ఇస్తే.. అందులో 76,029 జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఏకంగా 96,112 జీవోలు దాచిపెట్టారు.
హైకోర్టు రెండుసార్లు చెప్పినా
జీవో ఇచ్చిన 24 గంటల్లోగా దాన్ని జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో పెట్టాలని హైకోర్టు రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయినా సర్కార్ తీరులో మార్పు రావడం లేదు. అసలు ఏ మాత్రం ఉపయోగం లేని, జనాలకు సంబంధం లేని జీవోలను మాత్రం సైట్‌లో పెడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో మంత్రులు, ఉన్నతాధికారుల టీంతో కలిసి చైనాలో పర్యటించారు. దానికి సంబంధించిన ఖర్చుల వివరాలు జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో పెట్టడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి జీవోలను దాచిపెట్టడం మొదలుపెట్టారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రతి జీవో వెబ్‌సైట్‌లో పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో వారం, పది రోజుల్లో వచ్చిన కొన్ని ప్రధాన జీవోలు సైట్‌లో పెట్టారు. తర్వాత కథ మొదటికొచ్చింది. గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను 24 గంటల్లోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దళితబంధుపై ‘వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్’ వేసిన పిల్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి డిపార్ట్‌మెంట్ ఇచ్చే జీవోలను సైట్‌లో పెడితేనే పారదర్శకత ఉంటుందని చెప్పింది. లేకపోతే అనేక అనుమానాలకు ప్రభుత్వమే ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని తప్పుబట్టింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేల సంఖ్యలో జీవోలను ప్రభుత్వ సైట్‌లో పెట్టడం లేదు.
కాన్ఫిడెన్షియల్ అంటూ..
‘కాన్ఫిడెన్షియల్ అండ్ ఇంటర్నల్’ అని చెప్పి ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచుతోంది. ఇలాంటి జీవోలు సంబంధిత డిపార్మ్‌మెంట్ల హెచ్‌వోడీలు, సెక్షన్ ఆఫీసర్లు మాత్రమే చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంకెవరూ వాటిని చూడలేరు. జీవోలను విడుదల చేసే బాధ్యత ఆయా శాఖల సెక్షన్ ఆఫీసర్ల పరిధిలో ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం తర్వాత వాటిని సైట్‌లో పెట్టాలి. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఉన్న ఆదేశాలతో ఏ శాఖలోనూ ముఖ్యమైన జీవోలు వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయడం లేదు. జీవోపై సంతకం చేసే టైంలోనే ‘కాన్ఫిడెన్షియల్’ అని సదరు సెక్రటరీ రాస్తున్నట్లు తెలిసింది. దీంతో సెక్షన్ ఆఫీసర్లు జీవోఐర్ సైట్‌లో అందుబాటులో పెట్టలేదు. జీవో (ఎంఎస్– మాన్యువల్ స్క్రిప్ట్), జీవో (పి– ప్రింటెడ్), జీవో (ఆర్టీ–రొటీన్ కార్యకలాపాలకు సంబంధించినది) అని మూడు రకాలుంటాయి. అదే పద్ధతిలో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతారు. దేశంలో 2012లో నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసబుల్ పాలసీ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, కార్యకలాపాలు ప్రజలందరికీ చేర్చేందుకు ఈ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. అంతకంటే ముందు 2008లో ఉమ్మడి ఏపీలో గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ (జీవోఐఆర్) వినియోగంలోకి వచ్చింది. అప్పటి నుంచి జీవోలను సైట్‌లో పెట్టడం మొదలైంది.
సమాచారం బయటకు తెలియొద్దని?
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది, నిధులను ఎలా ఖర్చు చేస్తున్నది, ఎవరికి మేలు కలుగుతున్నదనే సమాచారం బయటకు పొక్కకూడదని ప్రభుత్వం అనుకుం టోంది. వాటితో ప్రజా వ్యతిరేకత వచ్చి.. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతాయనే దాస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జీవోలు దాచడం ఒక ఎత్తు అయితే.. సమాచార హక్కు చట్టం కింద ఇచ్చే ఇన్ఫర్మేషన్‌పై కూడా ప్రభుత్వం గతంలో ఆంక్షలు విధించింది. ఆర్టీఐ కింద ఎవరు సమాచారం కోరినా తొందరపడి ఇవ్వొద్దంటూ గత ఏడాది సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ఇవ్వాలని అంతర్గత ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైకోర్టు కలుగజేసుకోవడంతో వెనక్కి తీసుకున్నారు. జీవోలు సైట్‌లో పెట్టే విషయంలో మాత్రం అదే తీరు కొనసాగిస్తున్నారు. మెడికల్ బిల్లులు, వెహికల్ బిల్లులు, ఆయా డిపార్ట్‌మెంట్లలో చిన్నపాటి నిర్వహణ ఖర్చులు దర్శనమిస్తున్నాయి.
వెబ్‌సైట్‌లో పెట్టని ప్రధాన జీవోలు
- జులై 25న వీఆర్వోలను ఇతర శాఖల్లో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై 121 నంబర్ జీవో ఇచ్చారు.
- హైదరాబాద్ బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్‌కు భూమి కేటాయింపులు.
- పోలీసు కంప్లైంట్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన జీవోలు.
- ఉద్యోగాల భర్తీకి ఆర్థిక అనుమతుల జీవోలు కొన్ని సైట్‌లో లేవు.
- ఐఏఎస్‌లకు శాఖల కేటాయింపులు, బదలాయింపుల జీవోలు పెట్టలేదు.
- దళితబంధుకు సంబంధించి రూ.17,750 కోట్ల బీఆర్వో ఇచ్చారు. వెబ్‌సైట్‌లో లేదు.
- పంచాయతీరాజ్‌తో పాటు మరికొన్ని డిపార్ట్‌మెంట్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఈ ఉత్తర్వుల జీవోలు వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఎంతమంది రెగ్యులర్ అయ్యారనే దానిపైనా స్పష్టత లేదు.
- గురుకుల విద్యాసంస్థల సిబ్బందికి 2020 పీఆర్సీ అమలు చేస్తూ 2022 ఫిబ్రవరి 22న జీవో నంబర్ 2 జారీ అయింది. ఐదు నెలలు దాటినా సదరు జీవో సైట్‌లో కనిపించడంలేదు.
- కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇరిగేషన్ శాఖ ఇతర టెండర్ల జీవోలు ఏవీ జీవోఐఆర్ సైట్‌లో పెట్టలేదు.
- ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధర్ సిన్హాకు రెండేళ్లపాటు సర్కారు పొడిగింపు ఇచ్చింది. స్పెషల్ సీఎస్ హోదాను ఇచ్చి పశుసంవర్ధక శాఖలోనే కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. వెబ్‌సైట్లో పెట్టలేదు.
రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలుస్తలే
జీవోలన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారు. ప్రాజెక్టుల అనుమతులు, అంచనాలు, మంజూరు, రిటైర్ అయిన వారిని కన్సల్టెంట్‌గా తీసుకోవడం వంటి జీవోలను వెబ్ సైట్‌లో ఉంచటం లేదు. ఈ సర్కారులో పారదర్శకత, జవాబుదారీ తనం లేదు. రాష్ర్టంలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. హైకోర్టు చెప్పినా జీవోలు సైట్‌లో ఉంచటం లేదు. పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతున్న జీవోల్లో ఫోన్ బిల్లులు, పేపర్ బిల్లులవే ఉంటున్నయి. కొన్ని జీవోలను విడుదల చేసిన చాలా రోజుల తర్వాత వాళ్లకు కావాల్సిన టైమ్‌లో బయట పెడుతున్నరు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆర్టీఐ ద్వారా అడిగితే కొన్ని జీవోలు ఇస్తున్నరు. ఉన్నతాధికారులు రిటైరైన రోజే కన్సల్టెంట్ పేరుతో పొడిగింపు ఇస్తున్నరు.
= పద్మనాభరెడ్డి, సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్