ఆస్తి పన్ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం

ఆస్తి పన్ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
  • పూర్తి కావచ్చిన భువన్​ సర్వే
  • అక్టోబర్​ నుంచి అమల్లోకి
  • 40 శాతం వరకు పెరగనున్న ట్యాక్సులు

వనపర్తి, వెలుగు: మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కొత్త విధానంలో ఆస్తి పన్ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానానికి భిన్నంగా ఇల్లు, దాని ముందున్న ఖాళీ స్థలాల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ ఆధారంగా పన్ను విధించనున్నారు. దీంతో ఒకే మున్సిపాలిటీ పరిధిలో  ప్రాంతాలవారీగా పన్నులు పెరగనున్నాయి. గతంతో పోలిస్తే కొత్త ఆస్తి పన్ను విధానం ద్వారా సుమారు 40 శాతం వరకు ఆదాయం పెరుగుతుందని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. 2021 రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, తెలంగాణ ఉత్తర్వుల ప్రకారం 10 సంవత్సరాలు దాటిన నివాస గృహాలకు పది శాతం నుంచి 70 శాతం వరకు భవన విలువలో తరుగుదల చేయవచ్చు. కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న ఆన్​లైన్​విధానంలో 10 ఏళ్లు దాటిన ఇండ్లకు తరుగుదల లేకుండానే పన్నులు విధించడంపై ఇంటి యాజమనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ చట్టం ప్రకారం 75 చదరపు గజాలలోపు విస్తీర్ణం ఉన్న ఇండ్లకు ఆస్తి పన్ను మినహాయిస్తూ, నామినల్ ఇంటి పన్ను రూ. 100 వసూలు చేయాలి. కానీ ఆన్​లైన్​లో ఆ విధంగా ప్రోగ్రామింగ్ చేయకపోవడంతో  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

నిరుపేదలకు తప్పని కష్టాలు

భవనాలు లేదా ఖాళీ స్థలాలపై వాటి మూల విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదనలు చేయడంతో నిరుపేదలకు సైతం కష్టాలు తప్పడం లేదు. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లోని భవనాలు, ఖాళీ స్థలాలన్నిటికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వాటి మూల విలువ (స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించే కేపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్యూ) ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ విధానానికి సంబంధించి భవనాల విస్తీర్ణాన్ని చదరపుటడుగుల్లో, భూములు,- ఇళ్ల స్థలాలను చదరపు గజాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కొత్త ఇంటిపన్ను ప్రతిపాదన పేద, మధ్య తరగతి ప్రజలకు  ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే  పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అవస్థలు పడుతుంటే పన్నులు పెంచే ఆలోచనపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 

విలీన గ్రామాలపై పన్నుల మోత

కొత్త ఆస్తి పన్ను విధానంతో విలీన గ్రామాలకూ పన్నుల మోత తప్పడం లేదు. పాత మున్సిపాలిటీల్లో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు, ఇప్పటివరకు అనుమతి లేని వాటికి భువన్ రూల్స్​వర్తింపజేస్తుండడంతో  ట్యాక్స్ లు భారీగా పెరుగుతాయని మున్సిపల్ అధికారులు ఒప్పుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో వనపర్తి పాత మున్సిపాలిటీగా ఉంది. కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలను ఇటీవల కొత్తగా ఏర్పాటు చేశారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16,650 ఇళ్లు ఉండగా 15,746 ఇళ్లకు ఇప్పటికే సర్వే పూర్తయింది. ఇందులో 1,218  కమర్షియల్ ప్రాపర్టీ కాగా మరో 1,236  సెమీ కమర్షియల్ ప్రాపర్టీగా ఉన్నట్లు గుర్తించారు. 14,533 నివాస గృహాలుగా నమోదు చేశారు. వనపర్తి లో ఇటీవల కొత్తగా విలీనం అయిన గ్రామాలకు సైతం పన్నుల బెడద తప్పడం లేదు. ఇన్నాళ్లు చిన్న గ్రామపంచాయతీలుగా ఉన్న నాగవరం, రాజనగరం, నర్సింగాయపల్లి, శ్రీనివాసపురం గ్రామాల్లో ట్యాక్స్ లు పెరగడం పట్ల అక్కడి పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అస్తవ్యస్తంగా భువన్  సర్వే

ఇస్రో భువన్ సర్వే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇంటి కొలతలు, ప్లాట్ కొలతలు ఆన్​లైన్​చేయడానికి 2020 సంవత్సరంలో తెలంగాణ మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భువన్ సర్వే తొందరగా పూర్తి చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులను లేదా స్టూడెంట్స్ ను ఎంగేజ్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.  దీంతో  మున్సిపల్ కమిషనర్లు హడావిడిగా ప్రైవేట్ వ్యక్తులను, ఇంజనీరింగ్ స్టూడెంట్లను ఎంగేజ్ చేసుకుని కనీస అవగాహన లేకుండానే వారి ద్వారా ఇంటి, ప్లాట్ కొలతలను ఆన్​లైన్ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేయించారు. అలా చేసిన కొలతలను ప్రామాణికంగా తీసుకొని ఇంటి పన్నులను ఫైనల్ చేస్తున్నారు. స్టూడెంట్స్ తో భువన్ సర్వే చేయించిన ఇంటి కొలతలను అధికారికంగా మున్సిపల్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయకుండానే ఆన్​లైన్​లో ఇంటి పన్నులను ఫైనల్ చేస్తుండడం ప్రజలకు తలనొప్పిగా మారింది.  మరోసారి భువన్ సర్వే కొలతలను మున్సిపల్ అధికారులు అధికారికంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

దుకాణాలపై భారీగా..

వనపర్తి మున్సిపాలిటీలో కొత్తగా నిర్మిస్తున్న దుకాణాలకు భారీగా పన్నులు వేస్తున్నారు. గతంలో 10 బై 10 సైజ్ దుకాణానికి ఏడాదికి రూ.1,200 ఉండగా ప్రస్తుతం ఏడాదికి రూ.5 వేలు కట్టాల్సి వస్తోంది. ఇలా అయితే వ్యాపారం చేసి కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందే. చిరువ్యాపారులకు ట్యాక్స్ లో రాయితీ ఇస్తే బాగుంటుంది. పన్నుల పెంచడంపై  ప్రభుత్వం ఆలోచించాలి.

- చంద్రమోహన్, వ్యాపారస్తుడు, వనపర్తి

లోపాలు లేకుండా చూస్తాం

రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్లు, ఆస్తులకు సంబంధించిన ట్యాక్సెషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ నుంచి టాక్స్ లు పెరగనున్నాయి. భువన్ సర్వే పై మున్సిపల్ రెగ్యులర్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఏమైనా తేడాలు ఉంటే సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దాదాపుగా ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండానే ట్యాక్స్ లను ఫిక్స్ చేస్తున్నాం. 

- విక్రమసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్, వనపర్తి