డ్వాక్రా గ్రూపులకు వడ్డీ బకాయి రూ. 4 వేల కోట్లు

డ్వాక్రా గ్రూపులకు వడ్డీ బకాయి రూ. 4 వేల కోట్లు
  • బడ్జెట్​లో కేటాయింపులు రూ.1,250 కోట్లే
  • ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేయని సర్కార్ 
  • మూడున్నరేళ్లుగా మిత్తీ పైసలు ఇస్తలే 

హైదరాబాద్, వెలుగు: డ్వాక్రా గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడింది. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలను మూడున్నరేళ్లుగా చెల్లించడం నిలిపివేసింది. మహిళలు తీసుకున్న లోన్లపై బ్యాంకు ఆఫీసర్లు నెలనెలా మిత్తీని బరాబర్ వసూలు చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఆ డబ్బులను మహిళలకు తిరిగి చెల్లించడం లేదు. దీంతో ఏటేటా పెరుగుతూ పోయిన వడ్డీ డబ్బులు ఇప్పుడు సుమారు రూ.4 వేల కోట్ల మేరకు పేరుకుపోయాయి. 2021 – 22 బడ్జెట్ లో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీని చెల్లించేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించింది. కానీ నిరుడు హుజురాబాద్ ఎలక్షన్స్​ ముందు కేవలం రూ.200  కోట్లు రిలీజ్ చేసింది. 2022 – 23 బడ్జెట్ లో రూ.1,250 కోట్లు కేటాయించినా, ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయలేదు.   

కిస్తీ ఒక్కరోజు లేటైనా వడ్డీ కట్ 
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 3,99,120 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 43,29,058 మంది సభ్యులు ఉన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పరిధిలో మరో 1,81,225 ఎస్‌హెచ్‌జీల్లో మరో 19 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే, వడ్డీ రాయితీ వస్తుందన్న ఉద్దేశంతో పలు రంగాల్లో ఉపాధి పొందేందుకు రుణాలు తీసుకున్న మహిళలను ప్రభుత్వం నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోన్లు తీసుకున్న మహిళా సంఘాలు ప్రతి నెలా కిస్తీ చెల్లించాల్సిన తేదీకి ఒక్క రోజు లేటైనా.. ఆ నెల వడ్డీని తాము చెల్లించాల్సిన వడ్డీ లెక్కల్లోంచి ప్రభుత్వం తీసివేస్తోంది. మహిళా సంఘాలు బ్యాంకులో ఇన్ టైంలో కిస్తీ చెల్లిస్తేనే ఆ నెల వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీగా లెక్కగడుతున్నారు. మహిళల విషయంలో రూల్స్ ను కచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. వారి ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేయడంలో మాత్రం జాప్యం చేస్తోంది.  

మళ్లా ఎన్నికలొస్తెనే.. వడ్డీ పైసలు? 
ఎన్నికలు వస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా సంఘాలు గుర్తుకొస్తాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2018లో ఎన్నికలకు వెళ్లడానికి నెల రోజుల ముందు నాలుగేళ్ల వడ్డీ బకాయి కలిపి రూ.1,900 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లుగా బ్యాంకులకు మిత్తి జమ చేయడం లేదు. నిరుడు హుజురాబాద్ ఎన్నికల సమయంలోనే రూ.200 కోట్లు విడుదల చేసి.. ఆ నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాల ఖాతాల్లోనే ఎక్కువ మొత్తం జమ చేసింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే తప్ప ప్రభుత్వం వడ్డీ పైసలు జమ చేసే పరిస్థితి కనిపించడం లేదని సెర్ప్ ఉద్యోగులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు వాపోతున్నారు.