పరీక్షల నిర్వహణలో సర్కార్​ విఫలమైంది: కోదండరాం

పరీక్షల నిర్వహణలో సర్కార్​ విఫలమైంది: కోదండరాం

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయి.. ప్రభుత్వానికి లేదని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుని ఉంటే గ్రూప్ 1 పరీక్ష రద్దయ్యేది కాదన్నారు. ‘‘పరీక్ష రాసినోళ్ల కంటే ఓఎంఆర్ షీట్లు ఎక్కువ ఉండటం సర్కార్ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. పరీక్ష మొదలైన గంటలోగా ఎంతమంది అటెండ్ అయ్యారన్న వివరాలు టీఎస్​పీఎస్సీకి అందుతాయి.

అలాంటప్పుడు ఓఎంఆర్ షీట్లు ఎక్కువ ఎలా ఉంటాయి? టీఎస్​పీఎస్సీ నిర్లక్ష్య ధోరణికి తోడు ఎన్నికల కంటే ముందే పరీక్ష పూర్తి చేయాలని ప్రభుత్వం తొందరపడింది. అందుకే ఇన్ని తప్పులు జరిగాయి. టీఎస్ పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని అందరూ అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రూప్ 1 లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి” అని డిమాండ్ చేశారు.