అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్యం అదించేందుకు కృషి 

అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్యం అదించేందుకు కృషి 

హైద్రాబాద్: బస్తీ, పల్లె దవాఖానాలతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. నారాయణ గూడలోని శ్వాస ఆసుపత్రి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన  సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  25 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ శ్వాస హాస్పిటల్ ప్రజలకు బాగా చేరువైందన్నారు. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అందులో భాగంగానే బస్తీ, పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశామని, అనుభవైజ్ఞులైన వైద్యులను, సిబ్బందిని అందుబాటులో ఉంచామని మంత్రి పేర్కొన్నారు.  

అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.  వివిధ రోగాలను తొలి దశలోనే గుర్తించి... అందుకు కావాల్సిన చికిత్సను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నగరంలో మొత్తం350 బస్తీ దవాఖానాలు ఉన్నాయన్న మంత్రి... అందులో 57 రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. బస్తీ దవాఖానాల వల్ల ఉస్మానియా, ఫీవర్, గాంధీ హాస్పిటల్స్ కు వచ్చే పేషంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. ఇక పల్లె దవాఖానాలు కూడా అత్యద్భుతంగా పని చేస్తున్నాయని మంత్రి చెప్పారు.