ఘనంగా రాష్ట్ర అవతరణ సంబురాలు

ఘనంగా రాష్ట్ర అవతరణ సంబురాలు
  •  జూన్ 2న వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు 
  • గన్​పార్క్ వద్ద నివాళులు.. తర్వాత పరేడ్ గ్రౌండ్​కు సీఎం 
  • రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాక ప్రసంగం 
  • సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రత్యేక ఆకర్షణగా కార్నివాల్ 
  • ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన సీఎస్ 

హైదరాబాద్, వెలుగు : జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలిపారు. వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరించి, ప్రజలకు సందేశం ఇస్తారన్నారు. 

తెలంగాణ అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై ఈ మేరకు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియేట్ లో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి రివ్యూ నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారికంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అన్ని సర్కారు ఆఫీసులను అందంగా ముస్తాబు చేయాలని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ అనుమతితో వేడుకలు నిర్వహిస్తున్నట్లు సోమవారం సర్క్యూలర్ ఇచ్చామని సీఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్ పర్సన్స్, చైర్ పర్సన్ డీసీసీబీ, మున్సిపల్ చైర్మన్లు, సంబంధిత కార్యాలయాల్లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పారు. 

ట్యాంక్ బండ్​పై కార్నివాల్ 

రాష్ట్ర అవతరణ సంబురాల్లో భాగంగా జూన్ 2న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు సీఎస్ తెలిపారు. దీంతోపాటు  ట్రెయినింగ్ లో ఉన్న 5 వేల మంది పోలీసులు బ్యాండ్ తో ప్రదర్శనలో పాల్గొంటారని చెప్పారు. ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాల వారు తయారు చేసిన వస్తువులతోపాటు నగరంలోని పేరొందిన హోటళ్ళ ఆధ్వర్యంలో ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

 వేడుకలకు వచ్చే పిల్లల వినోదం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంబురాలకు జనం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున వారికి అన్ని రకాల సౌలతులు కల్పించేలా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. కల్చర ల్ ఈవెంట్ల తర్వాత బాణసంచా, లేజర్ షో కూడా ఉంటుందని సీఎస్ తెలిపారు. రివ్యూ మీటింగ్ తర్వాత సీఎస్ పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. స్టేజీ, బారికేడింగ్, కరెంట్, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు.