
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో భూతద్ధం పెట్టి వెతికినా కాంగ్రెస్ జాడ కనిపించదని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు. కుటుంబ పాలకులు ప్రధాని నరేంద్ర మోడీని గెలవకుండా మీటింగులు పెట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ బలపడుతుందని పరోక్షంగా కేసీఆర్, ఆయన టీమ్ మాట్లాడుతోందన్నారు. బీజేపీని ఎదుర్కొలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ బలపడాలని కోరుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు రెడీ అయ్యారన్నారు.
సీఎం కేసీఆర్ పోడు రైతుల్లో కనీసం పది శాతం మందికి కూడా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. సామాన్య రైతులను జైళ్లకి పంపిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు పూర్తిగా ఇచ్చేది బీజేపీ సర్కారే అని చెప్పారు. సిర్పూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఓడించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరీశ్ బాబు, సత్యనారాయణ, అత్మరాంనాయక్, రాష్ట్ర ఈసీ మెంబర్ కాళిదాస్ మజుందార్, అసెంబ్లీ కన్వీనర్ వీరభద్ర చారి, టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా, మండల అధ్యక్షులు తదితరులు
పాల్గొన్నారు.