కేసీఆర్ పాలనలో ప్రగతి పథంలో రాష్ట్రం

కేసీఆర్ పాలనలో ప్రగతి పథంలో రాష్ట్రం

జనగాం: మహనీయుల త్యాగఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మహిళలు, పిల్లలు వేసిన ముగ్గులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీఎం కెసీఆర్ అధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్రంలో వజ్రోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రజల్లో దేశభక్తి, సమైక్యతా భావాన్ని పెంపొందించేలా 15 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయడం, థియేటర్లలో పిల్లల కోసం గాంధీ సినిమాను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ లను స్ఫూర్తితోనే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.