బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలె

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలె

మెదక్‌: దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సవాలు విసిరారు. కులం, మతం అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. మెదక్ పట్టణంలో 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...  గతంలో కాంగ్రెస్ వాళ్లు కొన్ని ఇండ్లు ఇస్తే... వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, లంచాలు ఇవ్వడంతోనే సరిపోయిందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.

కొంతమంది హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, కానీ అవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఉచితాలు రద్దు చేయాలని బీజేపీ చెబుతోందన్న ఆయన... రైతు బంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూం ఇండ్లు, పెన్షన్లు వంటి పథకాలను రద్దు చేయాలని బీజేపీ నాయకులు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచితాలను రద్దు చేయాలన్న బీజేపీని ప్రజలు రద్దు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదన్నారు. తెలంగాణకు కొత్తగా ఒక్క నవోదయను కూడా ఇవ్వలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ... ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. కానీ అదే తెలంగాణ ప్రభుత్వం లక్షా 32 వేల పోస్టులను భర్తీ చేసిందన్నారు. సిలిండర్‌ ధరను బీజేపీ ప్రభుత్వం రూ. 400 నుంచి రూ.1200 వరకు పెంచిందని గుర్తు చేశారు. బీజేపీని గెలిపిస్తే రైతుల మోటర్లకు మీటర్లు పెడుతారని హెచ్చరించారు.