ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ

ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ
  • ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ
  • సంస్థకు ఏటా పెరిగిపోతున్న అప్పులుగుదిబండగా పీఎఫ్, సీసీఎస్ బకాయిలు
  • బడ్జెట్ నిధులు  రిలీజవ్వక సతమతం
  • బ్యాంక్ లోన్ల కోసం ఎదురుచూపులు
  • హామీలకే పరిమితమైన  రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బడ్జెట్ లో కేటాయించిన నిధులు రిలీజ్ అవ్వకపోవడం, బస్ పాస్  రీయింబర్స్ మెంట్ నిధులు అందకపోవడం, రాష్ట్ర సర్కారు వివక్ష తదితర అంశాల కారణంగా ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులతో  సతమతమవుతోంది. సంస్థకు ఆదాయం మెరుగ్గానే ఉన్నా.. కార్మికులకు బకాయిలు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉంది. కష్టాలను గట్టెక్కడానికి రాష్ట్ర సర్కార్ నుంచి స్పెషల్ గా ఆర్థిక సాయం అందకపోవడంతో భారీగా అప్పులు చేస్తోంది. ప్రధానంగా ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ట్రస్ట్ కు రూ.1500 కోట్లు, సీసీఎస్ కు సుమారు రూ. 1000 కోట్లు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. ఈ రెండే ప్రస్తుతం ఆర్టీసీకి పెద్ద గుదిబండగా మారాయి. వీటితో పాటు రిటైర్ మెంట్ అయిన వారికి కూడా అమౌంట్ సెటిల్ చేయాల్సి ఉంది. ఇక, డ్యూటీలో ఉన్న వాళ్లు పీఎఫ్ ట్రస్ట్ కు లోన్ కోసం అప్లికేషన్లు పెట్టుకోగా.. అవి ఆరు నెలలుగా పెండింగ్ లోనే  ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేకపోవడంతో  తమ మీద పడిన భారాన్ని బ్యాంక్ లోన్ల ద్వారా తగ్గించుకోవాలని ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీకి రూ.2500 కోట్ల అప్పులు ఉండగా..వాటికి రోజుకు రూ.2 కోట్లు వడ్డీలే చెల్లిస్తున్నారు. 

 కేటాయించిన నిధులు ఇవ్వట్లే 

ఆర్టీసీకి ఈ ఏడాది 2022–23  ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయించింది. వీటిలో సుమారు రూ.860 కోట్లు బస్ పాస్ రాయితీ నిధులే ఉన్నాయి. మిగతావి  బ్యాంక్  లోన్లకు కట్టాల్సి ఉంది. అయితే రూ.1500 కోట్లల్లో  రూ.600 కోట్లు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ప్రకటించిన ఫైనాన్షియల్​ ఇయర్ కు సైతం బడ్జెట్ లో రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇవి కూడా వస్తాయో, రావోనని సంస్థ ఆందోళన చెందుతోంది.

ఆదాయం ఎక్కడికి పోతోంది

ఆర్టీసీలో గతంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. వీఆర్ఎస్ స్కీమ్ తో కొంత మంది రిటైర్ మెంట్ తీసుకున్నారు. దాంతో బస్సుల సంఖ్య కూడా తగ్గింది. రోజు వారీగా సుమారు రూ.15 కోట్ల రెవెన్యూ వస్తోంది. దసరా, సంక్రాంతి, రాఖీ వంటి ప్రత్యేక పండుగల టైమ్ లో రికార్డు స్ధాయిలో ఆదాయం రాబడుతోంది. కార్గోకు కూడా మంచి ఆదరణ వస్తోంది. అయినా, పీఎఫ్ ట్రస్ట్ కు, సీసీఎస్ కు ఆర్టీసీ నిధులు ఎందుకు విడుదల చేయటం లేదని సంస్థ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 

బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నాలు

రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోవడంతో బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పీఎఫ్ ట్రస్ట్, సీసీఎస్ కు కొంత చెల్లించే యోచనలో మేనేజ్ మెంట్ ఉన్నట్లు బస్ భవన్ లో చర్చ జరుగుతోంది. ఇటీవల సూపర్ లగ్జరీ బస్సుల కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోగా..ఇప్పుడు మళ్లీ సుమారు రూ.400 కోట్ల కోసం చర్చలు జరుపుతోంది. వచ్చే నెలలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి 

తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాల్సి ఉంది. బడ్జెట్ లో  కేటాయించిన మొత్తం నిధులు ఇవ్వటం లేదు. గత ఏడాది బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో సగం కూడా విడుదల చేయలేదు. పీఎఫ్ ట్రస్ట్ కు రూ.1500 కోట్లు, సీసీఎస్ కు సుమారు వెయ్యి కోట్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇలా కార్మికులకు సంస్థ ఎన్నో చెల్లించాల్సి ఉంది. బడ్జెట్ లో రూ.1500 కోట్లు కేటాయించినట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో బస్ పాస్ రాయితీ నిధులే రూ.800 కోట్లకు పైగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ.600 కోట్లు మాత్రమేనా. ఆర్టీసీకి 3 వేల కోట్లు కేటాయించాలని కోరినా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. కార్మికులకు 2 పీఆర్సీ బకాయిలు ఉన్నాయి. 

- వీఎస్.రావు, జనరల్ సెక్రటరీ,  ఎస్ డబ్ల్యూఎఫ్