వ్యాక్సిన్ నిల్వల కోసం కోల్డ్ స్టోరేజ్‌‌లు ఏర్పాటు చేస్కోండి

వ్యాక్సిన్ నిల్వల కోసం కోల్డ్ స్టోరేజ్‌‌లు ఏర్పాటు చేస్కోండి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ పరిస్థితిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన ఈ మీటింగ్‌‌లో సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, టెస్టింగ్స్‌‌కు సంబంధించిన అంశాలను సీఎంలను మోడీ అడిగి తెలుసుకున్నారు. అన్ని సైంటిఫిక్ స్టాండర్డ్స్‌‌లో సేఫ్‌‌గా ఉన్న కరోనా వ్యాక్సినే దేశంలో అందుబాటులోకి తీసుకొస్తామని మోడీ చెప్పారు. వ్యాక్సిన్‌‌ను నిల్వ ఉంచడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంపై రాష్ట్రాలు పని చేయడం ప్రారంభించాలని మోడీ సూచించారు.

‘దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుంది. దీన్ని చూసి కొందరు వ్యాక్సిన్ బలహీనంగా మారిందని పొరబడుతున్నారు. ఇలాంటి ఆలోచన అలసత్వానికి దారితీస్తుంది. వ్యాక్సిన్‌‌కు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ వచ్చేలోపు ప్రజలను సురక్షితంగా ఉంచడం కీలకం. కరోనా పాజిటివ్‌‌ రేటును 5 శాతంలోపే ఉండేలా చూసుకోవడం మన ముందున్న పెద్ద సవాల్. భారత్‌‌లోని వ్యాక్సిన్ తయారీదారులతో మేం కాంటాక్ట్‌‌లో ఉన్నాం. గ్లోబల్ రెగ్యులేటర్స్‌‌తోపాటు ఇతర కంపెనీలతోనూ మేం టచ్‌‌లో ఉన్నాం. ఎన్ని డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అలాగే వ్యాక్సిన్ ధర ఎంతనేది కూడా ఇంకా నిర్ణయించలేదు’ అని మోడీ పేర్కొన్నారు.