గత పదేళ్లళ్లో కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని లూటీ చేసిందన్నారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ నూతన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం శ్రీహరి. దోచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ,సంతోష్ రావు లు పని చేశారని విమర్శించారు. 2014 ముందు వాళ్ల ఆస్తులు.. ఇప్పుడున్న ఆస్తుల వివరాలపై కేసీఆర్ ఫ్యామిలీ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు.. కేసీఆర్ కుటుంబానికి లేదని విమర్శించారు.
గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డీఎస్సీ వేయలేదన్నారు కడియం శ్రీహరి. విద్యాశాఖ రివ్యూకు కేసీఆర్ గంట సమయం కూడా కేటాయించలేదన్నారు. ఎన్నిసార్లు కేసీఆర్ను అడిగినా కనీసం పట్టించుకోలేదు..గత పదేళ్లలో ప్రభుత్వ విధానాలు సరిగా లేవని అడిగినందునే కేసీఆర్ నన్ను పక్కన పెట్టిండు అని కడియం చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెల్వదు.. ఆయన తర్వాతి స్థానం కోసమే బావ బామ్మర్దులు హరీష్ రావు.. కేటీఆర్ పోటీ పడుతున్నారని ధ్వజమెత్తారు. పేపర్లలో ఫోటోల కోసం పోటాపోటీ ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయరని మండిపడ్డారు.
పదేళ్లలో నిరుద్యోగులకు ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు కడియం. బీజేపీలోనూ అధికార యావ తప్ప మరొకటి లేదన్నారు. కిషన్ రెడ్డి , బండి సంజయ్ ,ఈటల, రఘునందన్ రావులు తలో మాట మాట్లాడుతారని విమర్శించారు. రఘునందన్ రావు హైడ్రాను సమర్థిస్తే ఇంకొకరు వద్దంటారని సెటైర్ వేశారు. ఈ నలుగురు కలిసి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ వైకరేంటో చెప్పాలన్నారు.
బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మరిచిపోయి ..రోడ్లపై కూర్చుని ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు కడియం శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక లోటు ఉన్నా రాష్ట్రాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. రేవంత్ రెడ్డికి మనమంతా అండగా ఉండాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు.