తెల్లబట్టలోళ్లకు అమ్ముడు పోవద్దు

తెల్లబట్టలోళ్లకు అమ్ముడు పోవద్దు

బీసీలకు అండగా ఉండేవాళ్లకు మద్దతివ్వాలి
బడుగులకు రేవంత్ రెడ్డి బలమైన చేతికర్ర: స్వామిగౌడ్
ఉద్యమంలో స్వామిగౌడ్ పై దాడి చేసినోళ్లే ఇప్పుడు కీలక పోస్టుల్లో
ఉన్నరు: రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు: తెల్లబట్టలేసుకున్న నాయకులకు అమ్ముడుపోవద్దని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవాళ్ల‌కే మద్దతివ్వాలని బీసీలకు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. రెడ్డి కులంలో పుట్టినప్పటికీ ఎంపీ రేవంత్ రెడ్డి బడుగు బలహీనవర్గాల వారికి బలమైన వెన్నుపూసగా, బలమైన చేతికర్రగా ఉన్నారని ఆయన కొనియాడారు. ఆదివారం బోయిన్‌పల్లి గౌడ సంఘం ఏర్పాటు చేసిన సర్దార్‌ సర్వాయిపాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణలో స్వామిగౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఒక పార్టీ రూ. 2,500 కోట్లున్న వ్యక్తిని ఎన్నికల్లో నిలబడితే.. అర్జెంట్ గా మరో పార్టీ 3,500 కోట్లున్న వ్యక్తిని నిలబెడుతది. ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే.. మరో పార్టీ 15 మందిని చంపినోడ్ని ఎతుక్కొచ్చి మరీ నిలబెడుతది. ఇలాంటి రాజకీయాలను అందరూ గమనించాలి. యువత రాజకీయాల్లో వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది” అని స్వామిగౌడ్ అన్నారు.

స్వామిగౌడ్ పోరాట స్ఫూర్తి గొప్పది: రేవంత్ రెడ్డి స్వరాష్ట్రంలో సామాజిక న్యాయం కరువైందని, దానిని సాధించుకోవడం కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరముందని రేవంత్‌ అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నవారిలో స్వామిగౌడ్‌ ఒకరని, రాజకీయంగా తామిద్దరికి భిన్నాభి ప్రాయాలు ఉన్నా స్వామిగౌడ్ పోరాట స్ఫూర్తి గొప్పదని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బడుగు, బలహీన వర్గాలకు ఇవాళ గుర్తింపు దొరకడం లేదని అన్నారు. సమైక్య పాలనలో స్వామిగౌడ్‌పై దాడి చేసిన ఆఫీసర్లే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్నారని చెప్పారు. అణగారిన వర్గాల కోసం భువనగిరి కోట నుంచి గోల్కొండ కోట వరకు పోరాటం చేసిన గొప్పవ్యక్తి సర్వాయి పాపన్న అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో నిర్ల‌క్ష్యానికి గురైనట్టుగానే తెలంగాణాలోనూ చరిత్రకారులకు గుర్తింపు దక్కడం లేదన్నారు. సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు.