తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, చిహ్నం రెడీ!

తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, చిహ్నం రెడీ!
  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
  • జూన్​ 2న గీతంతో పాటు విగ్రహం, చిహ్నం నమూనాల ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే  స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్​ కంపోజ్​ చేయిస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్​ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్​ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్​ చేయాలని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్​, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ ఉంది. ఈ నెల 27న గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ, జూన్​ ఒకటో తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంట్​ ఎన్నికలకు పోలింగ్​ ముగుస్తుంది. దీంతో జూన్​ 2న రాష్ట్ర ఆవిర్భావ సభకు ఎన్నికల సంఘం అనుమతి కోరడంతో పాటు ఆ సభకు చీఫ్​ గెస్ట్​గా సోనియా గాంధీని పిలవాలని ఇటీవల కేబినెట్​ భేటీలో తీర్మానించారు.

ఈసీ గ్రీన్​ సిగ్నల్​ ఇస్తే.. జూన్​ 2న రాష్ట్ర గీతంతోపాటు రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను ఆవిష్కరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ వేడుక కావడంతో రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్​ చేస్తున్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్లను ఘనంగా సన్మానించాలని భావిస్తున్నారు. 

సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబిబించేలా..

తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్​లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబించించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెత్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిసింది.