సీఎంఆర్ బకాయిలను రికవరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

సీఎంఆర్ బకాయిలను రికవరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

125 శాతాన్ని డిఫాల్ట్‌‌ రైస్‌‌ మిల్లర్ల నుంచి వసూలు చేయాలి
ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: 2021 – 22 వానాకాలం సీజన్‌‌కు సంబంధించి రైస్ మిల్లర్ల నుంచి పెండింగ్‌‌లో ఉన్న కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను రికవరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 494 మంది మిల్లర్లు నిర్ణీత సమయంలో పంపిణీ చేయని 2.22 లక్షల టన్నులు సీఎంఆర్‌‌ రికవరీ చేయాలని నిర్ణయించింది. ఎంఎస్‌‌పీతో ధాన్యం సేకరణ, సీఎంఆర్‌‌ డెలివరీ కోసం గతంలో జారీ చేసిన పాలసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రికవరీ చేయాలంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 – 22 ఖరీఫ్ సీజన్ కోసం సీఎంఆర్‌‌ డెలివరీ గడువు పొడిగించాలని రాష్ట్ర సర్కారు కోరగా.. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మార్చి 31 తర్వాత పొడిగించేందుకు అనుమతి ఇవ్వలేదు.

సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 494 మంది రైస్ మిల్లర్ల నుంచి 2.22 లక్షల టన్నుల సీఎంఆర్‌‌ డెలివరీ పెండింగ్‌‌లో ఉంది. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిల రికవరీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల ఆధారంగా రికవరీ చేయనున్నారు. సీఎంఆర్‌‌ బకాయిల్లో 125 శాతాన్ని (అసలు + 25 శాతం) డిఫాల్ట్‌‌ రైస్‌‌ మిల్లర్ల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిఫాల్ట్ అయిన మిల్లర్లు ముందుగా 25 చెల్లించాలని సూచించింది. 100  శాతం బకాయిలను 12 శాతం పెనాల్టీతో నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. 2023-=24 వానాకాలం సీజన్‌‌లోపు పెండింగ్‌‌లో ఉన్న సీఎంఆర్‌‌లో 100% పూర్తి చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది.