వరంగల్/ కాశీబుగ్గ (కార్పొరేషన్)/ గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ భద్రకాళి చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన 'కుడా' ఆఫీస్‍లో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశాదర, చాహత్ బాజ్‍పాయ్‍తో అభివృద్ధి పనులపై రివ్యూ చేపట్టారు. భద్రకాళి చెరువు పూడికతీత, మాడవీధుల పనులు వేగవంతం చేసి నిర్ధేశిత గడవులోగా పూర్తి చేయాలని చెప్పారు. భద్రకాళి చెరువుకు అవసరమైన గేట్లను తెప్పించి వారంలోగా ఏర్పాటు చేయాలన్నారు.
చాహత్ బాజ్‍పాయ్ మాట్లాడుతూ మాడవీధులకు సంబంధించి స్టోన్ వర్క్ నడుస్తోందన్నారు. సత్యశారద మాట్లాడుతూ వరంగల్ రైల్వే గేట్ వైపు ఉండే ఇరుకు మార్గం ద్వారా నగరంలోని మురుగునీరు భద్రకాళి చెరువులోకి ప్రవహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అధికారులు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కుడా చైర్మన్, హనుమకొండ కలెక్టర్‌తో కలిసి పద్మాక్షి శివముక్తి ధామ్‌ను పరిశీలించారు. అనంతరం వరంగల్‌సిటీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎమ్మెల్యే పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
