5 రోజుల్లో 50% పెరిగిన స్మాల్ క్యాప్ స్టాక్.. ఇన్వెస్టర్లు ఎగబడటానికి అదే కారణం..

5 రోజుల్లో 50% పెరిగిన స్మాల్ క్యాప్ స్టాక్.. ఇన్వెస్టర్లు ఎగబడటానికి అదే కారణం..

Sterlite Technologies Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. మార్కెట్లతో తమకు సంబంధం లేదు అన్నట్లుగా పెరగటం వెనుక కీలక పరిణామాలు ఉన్నాయి. ఈ క్రమంలో గడచిన 5 ట్రేడింగ్ సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్న స్మాల్ క్యాప్ స్టాక్ మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్టెర్లైట్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల గురించే. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న ఈ కంపెనీ షేర్లు గడచిన 5 ట్రేడింగ్ సెషన్ల నుంచి ఏకంగా 50 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసింది. అది దీనికి ప్రధాన కారణం నిరంతరం పెరుగుతున్న ఏఐ డేటా సెంటర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీ తన డేటా సెంటర్ల వ్యాపర పోర్ట్ ఫోలియోను మరింతగా విస్తరించాలని నిర్ణయించటమే. 

జూన్ 11న కంపెనీ షేర్లు ఒక్కోటి మార్కెట్లో దాదాపు రూ.75 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే కంపెనీ చేసిన వ్యాపార ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ల నుంచి షేర్ల కోసం పెరిగిన డిమాండ్ తో స్టాక్ ధర నేడు ఇంట్రాడేలో రూ.114.19కి చేరుకుంది. దీంతో స్టాక్ తన 52 వారాల గరిష్ఠానికి చేరువలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే గడచిన నెలలో కూడా కంపెనీ షేర్లు ఏకంగా 57 శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్లపై డబ్బుల వర్షం కురిపించింది. 

వాస్తవానికి కంపెనీ ఇప్పటి వరకు ఆప్టికల్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సేవలను అందిస్తున్నప్పటికీ.. మారుతున్న టెక్నాలజీ అవసరాలను వ్యాపారంగా మార్చుకునేందుకు డేటా సెంటర్ సొల్యూషన్స్ ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటన కంపెనీ షేర్లను విపరీతంగా పెంచేసింది. హైపర్‌స్కేలర్లు, కో-లొకేషన్ ప్లేయర్‌లు, ఎంటర్‌ప్రైజెస్ మరియు టెలికాం సేవలను అందించే కంపెనీల అవసరాలను తీర్చడానికి పరిష్కారాలను అందించనుంది. పైగా కంపెనీ కేబులింగ్ నుండి ఎండ్-టు-ఎండ్ కనెక్టివిటీ వరకు పూర్తి స్థాయి సేవలను అందించటంలో ప్రసిద్ధి చెందింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఐటీ ఎకోసిస్టమ్ కోసం TD SYNNEX అనుబంధ సంస్థ అయిన టెక్ డేటా-ఇండియాతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవటం ఒక కీలక పరిణామం. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.