ఇటుకల లొల్లి : ఏకే 47తో కాల్చిండు

ఇటుకల లొల్లి : ఏకే 47తో  కాల్చిండు

పక్కింటోళ్లతో ఇటుకల లొల్లి.. ఏకే 47తో కాల్చిండు
గన్​తో పాటు పరార్​.. నిందితుడు సదానందాన్ని వెతికిపట్టుకున్న పోలీసులు
అతని ఇంట్లో తల్వార్​, పోలీస్​ బెల్ట్​, బ్యాడ్జి

హుస్నాబాద్, వెలుగు : అతడో మేకల కాపరి. పేరు సదానందం. ఉండేది సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట.  గురువారం రాత్రి పక్కింటివాళ్లతో ఇటుకల గురించి గొడవ పెట్టుకున్నాడు. అది కాస్తా ముదరడంతో ఇంట్లోంచి ఓ తుపాకీ తీసుకొచ్చి, పక్కింట్లోకి కాల్పులు జరిపాడు. చుట్టుపక్కలవారు రాగానే పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి చూస్తే ఆ రెండు బుల్లెట్లు ఏకే–47కు చెందినవిగా గుర్తించారు. కాగా నిందితుడిని కోహెడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఆ గన్ ఎక్కడిదో,​ సదానందం చేతికి ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నారు.  సదానందం ఇంట్లో పోలీస్​ డ్రెస్​పై ఉండే బ్యాడ్జి కూడా దొరకడంతో గతంలో హుస్నాబాద్  పోలీస్ స్టేషన్ లో గల్లంతైన గన్ అదేనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కోహెడ మండలానికి చెందిన దేవుని సదానందం 10 సంవత్సరాల క్రితం  అక్కన్నపేటకు వలస వచ్చాడు. కుటుంబ కలహాల కారణంగా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, రెండో పెళ్లి చేసుకున్నాడు. సదానందం ఇంటి పక్కన నివసిస్తున్న  గుంటి గంగరాజు నాలుగు నెలల క్రితం ఎనిమిది  సిమెంట్ ఇటుకలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని కొంత కాలంగా సదానందం కోరుతున్నా గంగరాజు పట్టించుకోలేదు. మూడు రోజుల క్రితం ఇటుకల కోసం సదానందం భార్య కృష్ణవేణి గంగరాజు తల్లితో గొడవ పడింది. విషయం తెలుసుకున్న సదానందం ఇంట్లో ఉన్న కత్తితో గంగరాజుపై దాడికి యత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. ఈ  గొడవను మనసులో పెట్టుకున్న సదానందం గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన వద్ద ఉన్న తుపాకీతో గంగరాజు ఇంటి వైపు కాల్చాడు. అంతకు ముందు గన్​ పనిచేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు తన ఇంటి ముందున్న వాకిట్లో ఒక రౌండు పేల్చాడు. అనంతరం గంగరాజు ఇంటికి వెళ్లి కిటికీలోంచి కాల్చాడు. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో బుల్లెట్ ఇంటి లోపలి గోడకు తగిలింది. గమనించిన గంగరాజు కుటుంబ సబ్యులు పెద్ద పెట్టున కేకలు వేయడంతో పాటు గన్​ పేల్చిన శబ్దం విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో సదానందం పరారయ్యాడు. బాధితుడు గంగరాజు వెంటనే అక్కన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటిలో సోదాలు

గురువారం రాత్రి  హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్​ నిందితడు సదానందం ఇంటి  తాళం పగులగొట్టి  సోదాలు నిర్వహించగా ఒక తల్వార్, పోలీస్ బెల్ట్, బ్యాడ్జి లభించాయి.  పోలీసులు నిందితుడు సదానందం మామ  గుంటి వెంకటయ్యతో పాటు కుటుంబ సబ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గల్లంతైన గన్ అదేనా..?

మూడు సంవత్సరాల క్రితం హుస్నాబాద్   పోలీస్టేషన్  నుంచి గల్లంతైన  గన్నుల్లో ఇది ఒకటి కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాల పునర్విభజన సందర్భంగా కరీంనగర్  జిల్లాలోని  హుస్నాబాద్  పట్టణం సిద్దిపేట జిల్లాలో కలిసింది. తర్వాత హుస్నాబాద్  పోలీస్ స్టేషన్  లోని ఆయుధాలను లెక్కించే సమయంలో ఒక కార్బన్,  ఒక ఏకే 47 గన్  గల్లంతైన విషయం వెలుగు లోకి వచ్చింది. పోలీస్  స్టేషన్ నుంచి రెండు తుపాకులు మాయమయ్యాయనే వార్త, పోలీస్​వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అప్పటి హుస్నాబాద్ సీఐ భూమయ్యను పోలీస్  కమీషనర్  శివకుమార్  బదిలీ చేశారు. తుపాకుల గల్లంతులో తన ప్రయేయం లేకున్నా వ్యక్తిగత కక్షతో  పోలీస్ కమీషనర్ తనను బలి పశువు చేశారని సీఐ భూమయ్య బహిరంగంగా ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గల్లంతైన ఆయుధాలను పోలీసులు పట్టుకోలేకపోయారు. కాగా కాల్పులకు పాల్పడిన సదానందంను గతంలో గ్రామంలో జరిగిన ఒక వివాదంపై హుస్నాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా రెండు రోజుల పాటు అక్కడే ఉంచినట్లు  గ్రామస్థుల ద్వారా తెలిసింది. ఆ సమయంలోనే సదానందం తుపాకులను దొంగిలించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.