TRS లో ముసలం…స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తాం

TRS లో ముసలం…స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తాం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. స్థానికేతరులకు టిక్కెట్లు ఖరారు చేయడంతో పార్టీలో టికెట్ల లొల్లి షురువైంది. తాజాగా వికారాబాద్ జిల్లాలోని అనేక మండలాల్లో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ క్యాం పు కార్యాలయం ముందు వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొత్తపల్లి జడ్పీటీసీగా సిట్టింగ్ రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు. కొత్తపల్లి నుంచి సునీతామహేందర్ రెడ్డి, మోమిన్ పేట్ మండలం నుంచి ఉద్యమకారుడు బండ్ల విజయ్ కుమార్ జడ్పీటీసీగా పోటీ చేసేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ లో అసంతృప్తి రగులుకుంది. సునీతామహేందర్ రెడ్డి, బండ్ల విజయ్ కుమార్ ఇరువురు తాండూరు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కీలక నేతలు. దీంతో స్థా నికేతరులైన వారికి టికెట్లు కేటాయించొద్దు అంటూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎమ్మెల్యేతో ఆయా మండలాల నాయకులు పలు దఫాలుగా చర్చించారు. అయినా ఎమ్మెల్యే స్థానికులకు టికెట్లు ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఎమ్మెల్యేతో వారు వాగ్వాదానికి దిగారు. కేటీఆర్, కేసీఆర్ నిర్ణయం మేరకే ఆ రెండు స్థానాలు కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. మోమిన్ పేట మండల జడ్పీటీసీ స్థానం మూడు పర్యాయాలుగా స్థానికేతరులకు కేటాయించిన కారణంగా ముఖ్య నాయకులకు పదవులు దక్కలేదని వాపోయారు. స్థానికేతరులు పదవిలో కొనసాగినందున మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. స్థానికేతరులకు టిక్కెట్లు ఇచ్చి పోటీకి దింపితే వారిని చిత్తుగా ఓడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా స్థానికులను రంగంలోకి దించుతామన్నారు. మర్పల్లి జడ్పీటీసీ స్థానం కోసం కృష్ణయ్య, సిరిపురం సర్పంచ్ మల్లయ్య, స్థానిక నేత మధు టికెట్ ఆశిస్తున్నారు. కానీ సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు టిక్కెట్లు ఇవ్వడానికి పేర్లు పరిశీలించడంతో  సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్, థారూర్ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో నాయకులు తమ అనుచరులతో ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. నర్సింహులు గుప్త, అంజయ్య, మనోహర్, మల్లేశం, సత్యనా రాయణరెడ్డి, కాశీరాం , బ్రహ్మానందం తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.