భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ రికార్డు

భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ రికార్డు

ముంబై : సెన్సెక్స్​, నిఫ్టీలు రెండూ మంగళవారం సెషన్లో ఆల్​టైమ్​ హై వద్ద క్లోజయ్యాయి. ఏషియన్​ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతోపాటు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లతో ఇండెక్స్​లు మరోసారి దూసుకెళ్లాయి. సెన్సెక్స్​ 177 పాయింట్ల లాభంతో 62,682 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 18,618 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 62,887 పాయింట్లను తాకింది. సెన్సెక్స్​లో హిందుస్తాన్​ యునిలివర్​, సన్​ఫార్మా , నెస్లే, డాక్టర్​ రెడ్డీస్​, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు లాభాలు గడించాయి. మరోవైపు ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, మారుతి, పవర్​ గ్రిడ్​, లార్సెన్​ అండ్​ టుబ్రో షేర్లు నష్టాలపాలయ్యాయి. 

సియోల్, షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు లాభాల్లో ముగియగా, టోక్యో ఎక్స్చేంజి మాత్రం నష్టాలలో ముగిసింది. యూరప్​ మార్కెట్లో మధ్యాహ్నానికి స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. లాభాలతో మొదలైన మన మార్కెట్లు ఎఫ్​ఎంసీజీ, కన్జూమర్​ డ్యూరబుల్​ స్టాక్స్​ కొనుగోలుకు ఎగబడటంతో మధ్యాహ్నం సెషన్లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగించాయి. నవంబర్​ నెలలో ఎఫ్​ఐఐలు రూ. 32,344 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాజిటివ్​ ట్రెండ్​ బలపడిందని ఆనంద్​ రాఠి షేర్స్​ అండ్​ స్టాక్​ బ్రోకర్స్​ హెడ్​ రిసెర్చ్​ నరేంద్ర సోలంకి చెప్పారు. సోమవారం కూడా ఎఫ్ఐఐలు రూ. 936 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. బ్రెంట్​ క్రూడ్​ బారెల్​ 85.23 వద్ద ట్రేడవుతోంది.