విల్లాస్ ​క్రేజ్ ఖల్లాస్..కరోనా ఎఫెక్ట్​తో ఆగిన సేల్స్

విల్లాస్ ​క్రేజ్ ఖల్లాస్..కరోనా ఎఫెక్ట్​తో ఆగిన సేల్స్
  • వెయిట్ అండ్ సీ అంటున్న హయ్యర్ ఫ్యామిలీస్
  • సిటీ రియల్ మార్కెట్ లో 8,500 లగ్జరీ విల్లాలు
  • లాక్ డౌన్ తో 10% పెరిగిన నిర్మాణ వ్యయం

హైదరాబాద్, వెలుగుఒకప్పుడు ఇరుకైన అపార్టుమెంట్లలో ఉండటం ఇష్టం లేని ఎబౌవ్ మిడిల్ ​క్లాస్, హయ్యర్ ఫ్యామిలీస్​ దర్జాగా ఉండే విల్లాలపై ఇంట్రెస్ట్ ​చూపేవారు. ఒకేసారి కోట్లలో ఇన్వెస్ట్ చేసి, ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేందుకు గేటేడ్ కమ్యూనిటీస్​లో లగ్జరీ విల్లా కొనేవారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్​తో ఇన్​కమ్​ సోర్సెస్​ తగ్గడం, మార్కెట్ ట్రెండ్​లో ఒకేసారి పెద్దమొత్తంలో ఖర్చు చేయడం ఇష్టం లేక వెనకడుగు వేస్తున్నారు. గతంలో సిటీలో నెలలో 50కిపైగా విల్లాల సేల్స్​ జరిగితే… ఇప్పుడు పది కూడా ఉండడం లేదు.

సిటీ రియల్​ మార్కెట్​లో విల్లాస్​కి విపరీతమైన క్రేజ్ ఉంది. గడిచిన ఐదేండ్లలో ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో విల్లా ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారులతోపాటు సెలబ్రిటీలు కొనేందుకు ఆసక్తి చూపేవారు. డిమాండ్ ఉండడంతో రియల్టర్లు కూడా ఎబౌవ్ మిడిల్ క్లాస్ పీపుల్​అభిరుచికి తగ్గట్టుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కువగా తెల్లాపూర్, కోకాపేట, గండిపేట్, పటాన్​చెరు, హఫీజ్​పేట్, లింగంపల్లి, రాజేంద్రనగర్, కొండాపూర్, పుప్పాలగూడ, అప్పా జంక్షన్, ఇబ్రహీంపట్నం, రామోజీ ఫిలిం సిటీ, ఫార్మా సిటీ, మేడ్చల్, సుచిత్ర ఏరియాల్లో ప్రాజెక్టులున్నాయి. సిటీతోపాటు ముంబయి, బెంగళూరు, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా లగ్జరీ విల్లా ప్రాజెక్టులతో వ్యాపారం చేస్తున్నాయి. గత రెండేండ్లలో ఆన్ గోయింగ్ భారీ లగ్జరీ విల్లా ప్రాజెక్టులు 1,200 ఉండగా, స్మాల్, మీడియం, ప్రీమియం విల్లాలు మరో 7,500 దాకా నిర్మాణంలో ఉన్నాయి. కన్​స్ట్రక్షన్​లో ఉండగానే సేల్స్​ మొదలుపెట్టే కంపెనీలు ఆరు నెలల నుంచి కరోనా సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

విజిటింగ్​కి వారంలో ఇద్దరు, ముగ్గురే..

సిటీలో విల్లా ప్రాజెక్టుల సేలింగ్ మిగతా చోట్లతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. వాటిని మాత్రమే సేల్ చేసే ఎంఎన్​సీ రియల్ బ్రోకరేజీ సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. లాక్ డౌన్​తో సిటీ రియల్ మార్కెట్​లో  క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. జనం ఇండ్లకే పరిమితమవడంతో విజిటింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లడంతో నిర్మాణ పనులు కూడా ఆగిపోయాయి. విజిటింగ్​కి వచ్చే వారు కూడా తగ్గిపోయారు. సాధారణ రోజుల్లో డైలీ 10–15 మంది, వీకెండ్​లో 30–40 మంది క్లయింట్లు  వస్తే.. ఇప్పుడు వారంలో ఇద్దరు, ముగ్గురికి మించి రావడం లేదని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి.  సేల్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవంటున్నాయి. చాలామంది వెయిట్​ అండ్​ సీ మోడ్​లో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఇంతకుముందు నెలకి 50కిపైగా విల్లా ట్రాన్సాక్షన్స్​జరిగితే, ఇప్పుడు నెలకి 10  దాటడమే కష్టంగా ఉందని తెల్లాపూర్ లోని ఓ విల్లా ప్రాజెక్ట్ ​మేనేజర్ మహేందర్ తెలిపారు. ధరలపై కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా, కొనేవారు ముందుకు రావడం లేదన్నారు.

పెరిగిన నిర్మాణ వ్యయం

లాక్​డౌన్​ టైమ్​లో వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో నిర్మాణ రంగంపై తీవ్రంగా ఎఫెక్ట్​ పడింది. బిల్డర్లు ప్రాజెక్టులను నిలిపివేయలేక లోకల్​గా దొరికే కార్మికులకు అదనంగా చెల్లించి పనులు చేయించారు. సిమెంట్, మెటీరియల్ ధరలు కూడా పెరగడంతో 5 నుంచి 10 శాతం నిర్మాణ వ్యయం పెరిగినట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్లుగా మార్కెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన భారాన్ని భర్తీ చేసుకునేందుకు విల్లా ధరలు పెంచితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేసేవారు లేరంటున్నారు. రెడీ టు మూవ్ ప్రాజెక్టుల కంటే నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై పెరిగిన నిర్మాణ వ్యయం ఎక్కువ ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.

ప్రీమియం ఇండ్లకి డిమాండ్

గతంలో విల్లా ప్రాజెక్టులపై ఆసక్తి చూపిన వాళ్లు ఇప్పుడు ప్రీమియం రేట్లలో ఉండే ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. దాంతో గత నెల రోజుల్లో రీ సేల్, న్యూ సేల్స్ అపార్టుమెంట్ల క్రయ విక్ర యాలు భారీగానే జరిగాయి. సిటీ శివారు ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా రూ.30 లక్షల నుంచి 50 లక్షల్లోపు ఉండే ప్రాజెక్టులు తీసుకునేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్​ చూపిస్తు న్నారు. 50 లక్షల నుంచి 80 లక్షల మధ్య దొరికే ప్రీమియం విల్లాలకు కూడా ఇప్పుడిప్పుడే డిమాండ్ వస్తోందని చెబుతున్నారు. కరోనా కారణంగా సిటీలో బిజినెస్​లన్నీ పడిపోవడం రియల్ మార్కెట్​పై ప్రభావం చూపుతోందని, సాధారణ పరిస్థితికి చేరుకోవడానికి మరో 2 నెలలు పట్టొచ్చని రియల్ బ్రోకరేజీ చీఫ్ మేనేజర్ విజయ సారథి తెలిపారు.