ఏడాది వాన ఒక్కనాడే కురిసింది ..ఉత్తర చైనాలో కుండపోత

ఏడాది వాన ఒక్కనాడే కురిసింది ..ఉత్తర చైనాలో కుండపోత

బీజింగ్ : విఫా తుఫాను ప్రభావంతో ఉత్తర చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హెబీ ప్రావిన్స్‌‌లోని బావోడింగ్ సిటీలో గురువారం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కేవలం 24 గంటల్లోనే 447.4 మి.మీ. వాన పడింది. బావోడింగ్ సిటీలో వార్షిక వర్షపాతమే 500 మి.మీ. కాగా..ఇప్పుడు కేవలం 24 గంటల్లోనే 447.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

 దాంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. చైనా మెటీరియాలాజికల్ అడ్మినిస్ట్రేషన్ (సీఎంఏ) ప్రకారం.. బావోడింగ్ సిటీలో నీటిలో చిక్కుకుపోయిన 6,171 కుటుంబాల నుంచి 19,453 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ సిబ్బంది గురువారం రాత్రి మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ ప్రజలను తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ అయ్యాయి.