ఈదురు గాలుల బీభత్సం.. భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం

ఈదురు గాలుల బీభత్సం.. భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  వర్షం
  • ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు
  • పడిపోయిన విద్యుత్ స్తంభాలు
  • పంటలకు తీరని నష్టం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, ములుగు, వెలుగు: భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం  జిల్లాల్లో బుధవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇండ్ల పై  కప్పులు  ఎగిరిపోయాయి. పంటలు దెబ్బ తిన్నాయి. సెంటర్లలో వడ్లు తడిసిపోయాయి.  భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో   భూపాలపల్లి,  ములుగు జిల్లా కేంద్రాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. భూపాలపల్లి జిల్లాలో కేంద్రంలోని మైసమ్మ గుడి వద్ద  హోటల్  కప్పు ఎగిరిపోయి సామగ్రి దెబ్బతింది.  రూ 2 లక్షల నష్టం వాటిల్లినట్లు హోటల్‌‌‌‌ యజమాని వాపోయాడు.

రెండు జిల్లాలో 50కి పైగా కరెంట్‌‌‌‌ పోల్స్‌‌‌‌, ఐదు విద్యుత్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ ఫార్మర్లు కూలి కిందపడినట్లు విద్యుత్‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు.  వర్షాన్ని లెక్కచేయకుండా  రాత్రంతా విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.  ములుగు, వెలుతుర్లపల్లి , లక్ష్మీదేవిపేట, మల్లంపల్లి  సబ్‌‌‌‌స్టేషన్ల పరిధిలో ఎక్కువ  నష్టం వాటిల్లిందని ములుగు డీఈ నాగేశ్వర్ రావు తెలిపారు.  భూపాలపల్లి జిల్లాలో వర్షం వల్ల దెబ్బతిన్న పంటలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని తహసీల్దార్లను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇండ్లు దెబ్బతిన్నాయి. కారేపల్లి క్రాస్ రోడ్ లో రైతు భూక్య శంకర్ ఐదెకరాల బొప్పాయి తోట పూర్తిగా దెబ్బతింది.  రూ. సుమారు 6   పంట నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.ఎర్రుపాలెం  మార్కెట్ యార్డ్ లో ధాన్యం తడిశాయి. మిల్లర్ల కొర్రీలతో  వడ్లను ఎత్తక పోవడంతో అకాల వర్షానికి మొత్తం తడిసిపోయాయి.  ములకలపల్లి మండలంలోని మంగలిగుట్టలో ఇంటిపై వేప చెట్టు విరిగిపడడంతో దెబ్బతింది.  మహిళ కేకలు వేయడంతో  స్థానికులు ఆమెను రక్షించారు.