వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవుడి మహిమనేనంటూ పూజలు

వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవుడి మహిమనేనంటూ పూజలు

ప్రకృతిలో ప్రతిరోజు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంది. వినాయకుడు పాలు తాగాడనో.. లేకపోతే గుడిలో నాగుపాము శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసిందనో ఇలాంటి వింతలను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా వింత ఘటన చోటుచేసుకుంది. నాగిలిగొండ గ్రామంలోని పురాతన కాలం నాటి కాకతీయులు నిర్మించినటువంటి శివాలయంలో వేప చెట్టు నుంచి పాలు కారుతున్న దృశ్యాలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

వింత ఘటన

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పురాతన కాలం నాటి కాకతీయులు నిర్మించినటువంటి శివాలయంలో పది సంవత్సరాలు వయస్సు గల వేప చెట్టు నుండి పాలలాంటి తెల్లటి ద్రవం కారుతుంది. దీంతో గ్రామ ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. విరామం లేకుండా పాలు కార‌డం చూసి ఇదే దైవ మ‌హిమే అని అనేక మంది భక్తులు భావిస్తున్నారు.

శివుని మహిమే..

నాగిలిగొండ గ్రామంలోని శివాలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే పది సంవత్సరాల వయస్సున్న వేప చెట్టు నుండి తెల్లటి ద్రవం రావడంతోటి భక్తులు ఆ చెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో 50 సంవత్సరాల పైబడిన వేప చెట్లు ఉన్నా.. ఆ చెట్లకు ఇలాంటి వింత ఘటనలను చూడలేదు కానీ.. ఈ శివాలయంలో చెట్టుకు ఇలాంటి ఘటన జరగడం శివుని మహిమేనని భక్తులు అంటున్నారు. 

పాలా? కాదా?

అయితే కారుతున్నవి పాలా? కాదా? అన్న అంశంపై గ్రామస్థులకు ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే భారీగా కురిసే వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగి పాలు రూపంలో ఉన్న ఒక ద్రవం కారుతోందని నాస్తికులు చెపుతున్నారు. అయితే చెట్టుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.